చిరంజీవిని రాజకీయాల్లోకి లాగేస్తున్నారు.. కానీ, ఆయన వస్తారా.?

chiranjeevi

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవిని రాజకీయాల్లోకి లాగేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చిరంజీవి తమతో కలిసి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొనాలని విశాఖ స్టీలు ప్లాంట్ ఉద్యోగులు నినదిస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్, తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో చిరంజీవి ఫొటోకి పాలాభిషేకం చేసేశారు.

ఇంతకు ముందు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఫొటోకి కూడా పాలాభిషేకం చేసేశారు విశాఖ ఉక్కు కార్మికులు. ఇప్పుడు పొగడటం.. ఆ తర్వాత తిట్టడం.. ఇలాంటి సందర్భాల్లో మామూలే. ఇక, కేటీఆర్ కూడా ప్రత్యక్షంగా వచ్చి తమకు మద్దతు పలకాలంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరుతున్నారు.. ఆయన్ని కలిసి ఈ విషయమై విజ్ఞప్తి కూడా చేసేశారు.ఆయనే తనంతట తానుగా, విశాఖ వెళ్తానని గతంలో చెప్పారు గనుక, ఏమో తన తండ్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో కల్వకుంట్ల తారకరామారావు విశాఖ వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఇదిలా వుంటే, విశాఖ ఉక్కు విషయమై తెలంగాణ రాష్ట్ర సమితికి అంత ప్రేమ వుంటే, తెలంగాణలోని బయ్యారం గనుల్లో లభించే ముడి ఇనుముకి సంబంధించిన గనుల్ని విశాఖ స్టీలు ప్లాంటుకి కేటాయించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఉచిత సలహా ఇచ్చేశారు బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్. టీఆర్ఎస్, తెలంగాణ వ్యవహారాల్ని పక్కన పెడితే, చిరంజీవి.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. నిజానికి, చిరంజీవిని తిరిగి రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు తెరవెనుకాల బీజేపీ చాలా ప్రయత్నాలే చేస్తోంది. కానీ, చిరంజీవి మాత్రం రాజకీయాలకు దూరంగా, సినిమాలకు దగ్గరగా వుంటూ ‘నేను అందరివాడ్ని’ అనిపించుకుంటున్నారు. సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నడుపుతున్నా, పూర్తిగా జనసేనకూ చిరంజీవి మద్దతిచ్చేయడంలేదు. కానీ, ముందు ముందు చిరంజీవి రాజకీయాలపై కీలక నిర్ణయం తీసుకోక తప్పేలా కనిపించడంలేదు.