చిరంజీవి ‘దొంగమొగుడు’ రీమేక్..! యండమూరి ప్లానింగ్ తో కొత్తగా..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన దొంగమొగుడు 80ల్లో సూపర్ హిట్ అయింది. చిరంజీవిలోని మాస్ యాక్షన్, కామెడీ మరింత కొత్తగా చూపించడంతో చిరంజీవి కెరీర్లో ఒక సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కింది. అప్పట్లో.. యండమూరి వీరేంద్రనాధ్ నవలలు రచనా రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. 80వ దశకంలో ఆయన నవలలు వార పత్రికల్లో హైలైట్. ఆయన సీరియల్స్ కోసమే వారపత్రికలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. అలాంటి రచనల్లోనే ఒకటే ‘నల్లంచు తెల్లచీర’. ఇప్పుడీ నవల సినిమాగా యండమూరీ దర్శకత్వంలోనే రీమేక్ కాబోతోంది.

 

స్టూవర్టుపురం పోలిస్ స్టేషన్, దుప్పట్లో మిన్నాగు నవలలను ఆయన స్వీయ దర్శకత్వంలో అప్పట్లో సినిమాలుగా తెరకెక్కించారు. అవి రెండూ ఫ్లాప్ సినిమాలయ్యాయి. మళ్లీ ఆయన దర్శకత్వం చేయలేదు. మూడు దశాబ్దాల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నారు. ‘నల్లంచు తెల్లచీర’ అనే నవల పేరుతోనే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. సరికొత్త కథనంతో.. నేటి జనరేషన్ కు తగ్గట్టుగానే తెరెకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలు యండమూరి నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీ రిలీజ్ కోసం రూపొందిస్తున్నారు.

 

ఊర్వశి ఓటీటీ సమర్పణలో భీమవరం టాకీస్ – సంధ్య స్టూడియోస్ బ్యానర్స్ పై సినిమా తెరకెక్కుతోంది. నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ – రవి కనగాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాకు తాళ్లూరి నాగరాజు సంగీతం అందిస్తున్నారు. అమీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాపరంగా ఇది మాస్, ఫ్యామిలీ కంటెంట్ తో తెరకెక్కింది. చిరంజీవి మాస్, మాధవి, రాధిక నటన, కథ సినిమాకు బలం. చక్రవర్తి సంగీతంలోని పాటలన్నీ అప్పట్లో సూపర్ హిట్టే. ఇప్పుడు తెరకెక్కిస్తున్న ‘నల్లంచు తెల్లచీర’ మళ్లీ ఆనాటి మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందా.. రీమక్ మూవీనా.. ఏ జోనర్ లో తెరకెక్కుతుందనేది చూడాల్సి ఉంది.