మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలని ప్రతి దర్శకుడికి ఉంటుంది.కొందరికి ఈ అదృష్టం దక్కితే కొందరికి అవకాశం దక్కినట్టే దక్కి చేజారిపోతుంటుంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ విషయంలోనూ ఇదే జరిగింది. చిరంజీవి రీమేక్ చేయాలని భావించిన ‘లూసిఫర్’ రీమేక్ సుజీత్ చేయాలి. మొట్టమొదట ట్రాక్లోకి వచ్చింది అతనే. కానీ అతని మీద నమ్మకం సరిపోలేదో ఏమో కానీ పక్కకు తప్పించారు. సుజీత్ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని అన్నారు కానీ తప్పించారనేదే వాస్తవం. ఆ తర్వాత సీన్లోకి వినాయక్ రావడం చివరికి అతను కూడ తప్పుకుని చివరికి మోహన్ రాజా ఫిక్స్ అయ్యాడు.
ఈ సంగతులన్నీ పక్కనబెడితే మరోసారి సుజీత్ చిరంజీవిని డైరెక్ట్ చేయనున్నారనే వార్తలు మరోసారి మొదలయ్యాయి. ఈసారి కూడ రీమేక్ సినిమానే ఈ వార్తలకు కేరాఫ్ అడ్రెస్ అయింది. తమిళంలో అజిత్ చేసిన ‘ఎన్నై ఆరిందాల్’ చిత్రాన్ని చిరంజీవి రీమేక్ చేయాలని అనుకుంటున్నారట. ఇందుకోసం సుజీత్ పేరు పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ వార్తల్లో అస్సలు వాస్తవం లేదని ఇట్టే అర్థమైపోతోంది. ఎదుకంటే ఆ చిత్రం ఆల్రెడీ తెలుగులో ‘ఎంతవాడుగానీ’ పేరుతో డబ్ అయింది. డబ్ అయిన చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేయాలని ఏ హీరో అనుకోడు. అందునా చిరంజీవి లాంటి హీరో అస్సలు అనుకోరు.
ఇప్పటికే అన్నీ రీమేక్ సినిమాలే చేస్తున్నారని అభిమానులు సైతం కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో చిరంజీవి మళ్లీ ఇంకొక రీమేక్ సినిమాను అందునా డబ్ అయిపోయిన సినిమాను రీమేక్ చేస్తారనే వార్తలను ఎంతవరకు నమ్మగలం. కాబట్టి ఈ కథనాలన్నీ ఒట్టి పుకార్లే అనుకోవాలి.