ఇప్పుడంటే స్టార్ హీరోలుగా ఉన్న ఆ నలుగురైదుగురు హీరోలు పోటీని మనసులో పెట్టుకోకుండా ఎవరిపాటికి వాళ్ళు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కానీ ఒకప్పుడు ఇలా లేదు. అగ్ర స్థానం కోసం రేసులో ఉన్న ప్రతి హీరో కూడ చేసే ప్రతి చిత్రం తమను నెంబర్ వన్ పీఠం మీద కూర్చోబెట్టేదిలా ఉండాలనుకునేవారు. ఒకటి నిరాశపరిచినా ఆ వెంటనే ఇంకొక సినిమాతో దిగిపోయేలా చూసుకునేవారు. మెగాస్టార్ చిరంజీవి కూడ అంతే. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోలు విపరీతమైన ప్రేక్షకాదరణతో వెలిగిపోతున్న సమయంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడానికి చాలానే కష్టపడ్డారు.
ఆరోజుల్లో ఆయన నమ్ముకున్న సక్సెస్ ఫార్ములా ఒక్కటే.. అదే కమర్షియల్ ఫార్ములా. తెలుగు సినిమా పౌరాణికం, ఫ్యామిలీ అంటూ ఒక మూలసలో కొట్టుకుని పోతుంటే చిరు మాత్రం ఫైట్లు, డ్యాన్సులు, కామెడీ అంటూ కమర్షియల్ బాట పట్టారు. ఏడాదిలో కనీసం ఏడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నెంబర్ వన్ పీఠం మీద కూర్చున్నా కూడ రిలాక్స్ కాకుండా సంవత్సరంలో నాలుగు సినిమాలను ఇచ్చేవారు. అదే ఆయన్ను నిలబెట్టింది. అందుకే అదే పద్దతిని ఇప్పటికీ పాటిస్తున్నారు.
వసూళ్లు, రికార్డుల పరంగా కొత్తగా సాధించాల్సింది ఏమీ లేకపోయినా 65 వయసులో కూడ శరీరానికి మించిన శ్రమ చేస్తున్నారు. ఈ 2021లో రెండు సినిమాలను రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ ముగింపు దశకు చేరుకోగా ఏప్రిల్ నుండి ‘లూసిఫర్’ రీమేక్ స్టార్ట్ చేయనున్నారు. దాన్ని కూడ నాలుగైదు నెలల్లో ఫినిష్ చేసి మెహర్ రమేష్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని అది పూర్తవగానే ఏడాది చివర్లో బాబీ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నారు. ఆయన చేస్తున్న కష్టం చూస్తుంటే హీరోగా ఆయనలో దాహం ఇంకా తీరలేదనే అనిపిస్తోంది.