ఈరోజు మే 28న స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి 98వ జయంతి. ఈ సందర్భంగా తెలుగు జాతి మొత్తం ఆయన సేవలను గుర్తుచేసుకుంటోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లుగా.. మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు ఎన్టీఆర్‌కు భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణం. వారి 100వ జయంతి దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌కు ఈ గౌరవం దక్కితే అది తెలుగువారికి దక్కే గౌరవం’ అన్నారు.
రామారావుగారికి భారటరత్న ఇవ్వాలనేది కొత్త డిమాండ్ ఏమీ కాదు. చాలా ఏళ్లుగా చాలా మంది ప్రముఖులు ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఆ డిమాండ్ బలంగా కేంద్ర నాయకుల వద్దకు వెళ్లిన దాఖలాలు లేవు. అలాగని కేంద్ర నాయకులకు ఎన్టీఆర్ గొప్పతనం తెలియదా అంటే తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో ఏ కేంద్ర నాయకుడు వచ్చి పొలిటికల్ మీటింగ్ పెట్టుకున్నా గుర్తుచేసుకునే మహానీయుల్లో ఎన్టీఆర్ కూడ ఉంటారు. ఎన్టీఆర్ చేసిన రాజకీయ సంస్కరణలు కూడ అందరికీ తెలుసు. కానీ ఆయనకు భారతరత్న ఇవ్వడం మీదనే ఎవ్వరూ గట్టిగా మాట్లాడలేదు. ఇప్పటికే పలుమార్లు రామారావుగారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన చిరు మళ్లీ తన గొంతుక వినిపించారు.