రాజకీయాలంటేనే అంత. కులం, మతం, ప్రాంతం.. ఇలా అన్నీ ఆపాదించేస్తారు. మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాల్లో ఈ దెబ్బ మరీ గట్టిగా తగిలేసింది. ఓ కులానికీ, ఓ ప్రాంతానికీ ఆయన్ని పరిమితం చేసేలా అప్పట్లో రాజకీయాలు నడిచాయి. కొందరు అయితే, అత్యంత జుగుప్సాకరంగా ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. ఓ మహిళా నేత అయితే, ఇంకా అసహ్యంగా చిరంజీవి మీద విరుచుకుపడిపోయారు. సదరు మహిళా నేత ఇప్పుడు ‘అందరివాడు’ చిరంజీవి.. అంటూ మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. ఎంత రాజకీయాల్లో వుంటే మాత్రం, అంతలా దిగజారిపోవాలా.? అలా దిగజారకపోతే నాయకులకు.. మరీ ముఖ్యంగా మహిళా నేతలకు రాజకీయాల్లో అవకాశాలు వుండవా.? అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. దాంతో, సోషల్ మీడియా హోరెత్తింది.
చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనతో తమకున్న అనుబంధాన్ని ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చాటుకున్నారు. వీరిలో చాలామంది గతంలో చిరంజీవిని అత్యంత దారుణంగా విమర్శించినవారే. రాజకీయాల్లో విమర్శలు సహజం. రాజకీయ విమర్శల్ని పక్కన పెడితే, చిరంజీవి వ్యక్తిగత జీవితం మీద మచ్చపడేలా కొందరు నాయకులు దిగజారుడు విమర్శలు చేశారు. అదే అసలు సమస్య. చిరంజీవి తిరిగి వారందరితో కలిసిపోతున్నా, అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలిపిన ఆయా సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో మెగాభిమానులు దిమ్మతిరిగే స్థాయిలో కౌంటర్లు వేయడం గమనార్హం. ‘నేనెవర్నీ ద్వేషించను.. నాకు ద్వేషించడం చేతకాదు..’ అని చిరంజీవి చెబుతుంటారు. అదే ఆయన ప్రత్యేకత.