Chiranjeevi : చిరంజీవి పెద్దరికం.. మళ్ళీ వర్కవుట్ అవుతోందా.?

Chiranjeevi  : మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ సీన్‌లోకి వస్తున్నారు. ఆయనే తనంతట తానుగా వస్తున్నారా.? పరిశ్రమ పెద్దలు మళ్ళీ ఆయన్ని ‘పెద్దన్న’గా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా.? సినిమా టిక్కెట్ల వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవి సంప్రదింపులు జరపబోతున్నారన్న ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

తొలుత మంత్రి పేర్ని నానితోనూ, ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనూ మెగాస్టార్ చిరంజీవి సినిమా టిక్కెట్ల వ్యవహారంపై చర్చించబోతున్నారట. అదెప్పుడన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అసలు చిరంజీవి నిజంగానే వెళతారా.? వెళ్ళరా.? అన్నదానిపైనా చాలా సందిగ్ధమే వుంది.

‘మా’ ఎన్నికల వేళ, చిరంజీవిని అనవసరంగా కొందరు వివాదాల్లోకి లాగారు. ‘చిరంజీవి పెద్దమనిషి కాదు.. మేమే పెద్ద మనుషులం..’ అంటూ కొందరు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ వ్యవహారంలో చిరంజీవి కాస్త నొచ్చుకున్నారు కూడా.

నిజానికి, ఏనాడూ చిరంజీవి తాను ‘పెద్దరికం’ తీసుకున్నట్లు ప్రకటించలేదు. పరిశ్రమ సమస్యలు చిరంజీవి వద్దకు ఎవరైనా తీసుకెళితే, వాటి పరిష్కారం కోసం ఆయన తనవంతు కృషిచేసేవారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో సంప్రదింపుల కోసం చిరంజీవినే ముందు పెట్టేవారు పరిశ్రమ ప్రముఖులు.

ఎప్పుడైతే ‘మా’ రగడ జరిగిందో, ఆ తర్వాత చిరంజీవి కూడా.. తనపై ప్రముఖులు మోపుతున్న భారం పట్ల కొంత అనాసక్తి ప్రదర్శించారు. కానీ, ఇప్పుడు తప్పడంలేదు. గతంలో జరిగిన తప్పుల్ని పెద్దమనసుతో అర్థం చేసుకోవాలంటూ చిరంజీవిని కోరిన సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వంతో చర్చల కోసం చిరంజీవిని ముందుకు వెళ్ళమని వేడుకుంటున్నారట.

ఏమో, చిరంజీవి చెప్పినా.. ఏపీ సర్కారు టిక్కెట్ల వ్యవహారంలో వెనకడుగు వేస్తుందా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.