‘మా’ ఎన్నికల రగడ ఇప్పట్లో అస్సలేమాత్రం చల్లారేలా కనిపించడంలేదు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత అంతా కలిసే వుంటాం.. మేమంతా సినీ కళామతల్లి బిడ్డలం.. అని చెప్పుకున్నారుగానీ, అంతా హంబక్. పోలింగ్ రోజున ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, విష్ణు.. కౌగలించుకోవడంతోనే వివాదాలన్నీ సద్దుమణిగిపోతాయని అంతా అనుకున్నారు.
అయితే, పోలింగ్ తర్వాత రాజకీయం మరింత వేడెక్కింది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ చాలా ఆరోపణలు చేసింది. మంచు విష్ణు ప్యానెల్ నుంచి కూడా ఎదురుదాడి జరుగుతోంది. ఆ రోజు జరిగిన గొడవపై సీసీటీవీ ఫుటేజ్ కోరారు ప్రకాష్ రాజ్, ఎన్నికల అధికారిని. దాంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
తాజాగా, సీసీటీవీ ఫుటేజీకి సంబంధించి సర్వర్ రూమ్‌కి పోలీసులు తాళాలు వేశారు. ఇంతకీ, ఆ సీసీటీవీ ఫుటేజీలో ఏముంది.? ఇప్పటికే దాంట్లోంచి కొన్ని సన్నివేశాల్ని తొలగించడం జరిగిందా.? ఇలా చాలా అనుమానాలు తెరపైకొస్తున్నాయి.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ గనుక కోర్టును ఆశ్రయిస్తే, ‘మా’ ఎన్నికల వివాదం కొత్త మలుపు తిరుగుతుంది. పోలింగ్ రోజున మోహన్ బాబు తమపై మాటల దాడికే కాదు, భౌతిక దాడికి కూడా దిగారన్నట్టుగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఆరోపిస్తోన్న విషయం విదితమే. అలాంటిదేమన్నా నిజంగా జరిగి వుంటే అది సీసీటీవీ ఫుటేజీలో బయటపడుతుంది.
ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన హేమ, మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేసిన శివబాలాజీ చెయ్యి కొరకడం అయితే కెమెరాలకు చిక్కింది. అంతకు మించి లోపల జరిగిన గొడవలపై వీడియో సాక్ష్యాలేమీ బయటకు రాలేదు. దాంతో, అసలు లోపట ఏం జరిగింది.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి.