పవన్ అడుగుజాడల్లో చంద్రబాబు నడుస్తున్నారా.?

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి జనసేన పార్టీ ఇప్పటికే చేతులెత్తేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వైఎస్సార్సీపీ నుంచి ఈ నేపథ్యంలో విపక్షాలు, ‘పద్ధతిగా’ అయితే పోటీకి దిగకూడదు. బీజేపీ – జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలనే ప్రయత్నాలు జరిగాయి.

కానీ, జనసేన అధినేత పవన్.. ఇటీవల రాయలసీమ పర్యటలో మాట్లాడుతూ, తమ పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టడంలేదని స్పష్టం చేశారు. ఆ వెంటనే, టీడీపీ నుంచి కూడా అలాంటి ప్రకటనే వచ్చింది. నిజానికి, టీడీపీ ఇప్పటికే బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించి తమ అభ్యర్థిని ప్రకటించింది. కానీ, పవన్ అడుగు జాడల్లో నడవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో, అనూహ్యంగా తమ అభ్యర్థిని బరిలోంచి తప్పిస్తున్నట్లు టీడీపీ ప్రకటించాల్సి వచ్చిందన్నమాట.

కాగా, బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని నిలబెడతామంటోంది. ఈ విషయమై జనసేన అధినేతతో చర్చలు జరుపుతామని కూడా బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీనే పోటీలోంచి తప్పుకున్నాక, బీజేపీ మాత్రం రంకెలేసి ప్రయోజనమేంటి.? తిరుపతి ఉప ఎన్నిక ఫలితాన్ని బీజేపీ మర్చిపోయిందని అనుకోవాలా.? లేదంటే, ఇంకా బీజేపీలో అత్యుత్సాహం తగ్గలేదనుకోవాలా.? పోటీ చేసినా బీజేపీ గెలిచే అవకాశమే లేదు.

గెలవడం సంగతి సరి కదా.. అసలు బీజేపీ డిపాజిట్ తెచ్చుకోవడం కూడా కనా కష్టమే. ఆ సంగతి బీజేపీ నేతలకీ తెలుసు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా కొందరు బీజేపీ నేతలకే విషయం అర్థం కావడంలేదు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక విషయానికొస్తే.. అక్కడ సిట్టింగ్ ఎంపీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయలేదు గనుక, ఇతర రాజకీయ పార్టీలు పోటీలో దిగాయంటే.. దానికో అర్థముంది.

బద్వేలులో పోటీ చేసి అపప్రధ తెచ్చుకోకూడదనే టీడీపీ, జనసేన ‘ఏకగ్రీవ’ నిర్ణయం తీసుకున్నాయా.? లేదంటే, పరువు పోతుందని వెనక్కి తగ్గాయా.? ఏదైతేనేం, బద్వేలు ఉప ఎన్నిక ఏకగ్రీవమవడానికి మార్గం సుగమం అవుతోందన్నమాట.