YS Jagan: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.. బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల, సీబీఐ కోర్టులో ‘బెయిల్ రద్దు’ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.
అయితే, తొలుత రఘురామ పిటిషన్‌ని సీబీఐ కోర్టు అడ్మిట్ చేసుకోలేదు. కొన్ని మార్పుల తర్వాత, పిటిషన్‌కి అదనపు సమాచారం జోడించి, మరోమారు పిటిషన్ దాఖలు చేశారు రఘురామకృష్ణరాజు. ఆ పిటిషన్‌ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, తాజాగా జగన్ మోహన్ రెడ్డికీ అలాగే సీబీఐకీ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 7న ఇటు వైఎస్ జగన్ అటు సీబీఐ, కోర్టు నోటీసులకు సమాధానం చెప్పవలసి వుంటుంది.
కాంగ్రెస్ హయాంలో వైఎస్ జగన్ మీద అక్రమాస్తుల కేసు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి సహా పలువురు జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. అనంతరం బెయిల్ మీద వీరంతా విడుదలయ్యారు. ప్రజా కోర్టులో తన నిర్దోషిత్వాన్ని వైఎస్ జగన్ నిరూపించుకున్నారంటూ వైసీపీ శ్రేణులు చెబుతుంటాయనుకోండి.. అది వేరే సంగతి.
ఇక, రఘురామకృష్ణరాజు పిటిషన్‌కి విచారణార్హతే లేదంటూ వైసీపీ మద్దతుదారులైన కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రఘురామకృష్ణరాజు మాత్రం, తాను దాఖలు చేసిన పిటిషన్ మీద పూర్తిస్థాయి నమ్మకంతో వున్నారు. పిటిషన్‌ని విచారణకు స్వీకరించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి న్యాయస్థానం నోటీసులు పంపడం ఆహ్వానించదగ్గ పరిణామమనీ, ప్రొసీడింగ్స్ ఆసక్తికరంగా వుండబోతున్నాయనీ రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు.
కాగా, రఘురామకృష్ణరాజు, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా విజయం సాధించారు. అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా వ్యవహరించిన రఘురామకృష్ణరాజు, ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. వైసీపీ, రఘురామకృష్ణరాజు మీద వేటు వెయ్యదు.. రఘురామకృష్ణరాజు ఎంపీ పదవికి రాజీనామా చెయ్యరు.. ఇదొక అంతులేని కథగా మారిపోయింది.