పాలన వికేంద్రీకరణ లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశం గురించి తెలిసిందే. విశాఖ, కర్నాలు, అమరావతి రాజధానులగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విశాఖ అభివృద్ది దిశగా పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవలే రెండవసారి మూడు రాజధానుల బిల్లును మరోసారి అసెంబ్లీలో ఆమోదించి శాసనసభకు పంపించారు. అక్కడా పాత పరిస్థితే మళ్లీ తలెత్తిన నేపథ్యంలో రాజ్యంగం ప్రకారం బిల్లు అమోదం పొందినట్లుగానే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బిల్లు గవర్నర్ దగ్గర ఉంది. ఆయన సంతకం కాగానే బిల్లు చట్ట రూపం దాల్చుతుంది.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాజధాని తరలింపు మరింత ఆలస్యం అవుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత తరలింపు పనులు ప్రారంభిస్తామన్నారు. జూలైలో కరోనా కేసుల సంఖ్య మూడు రెట్లు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ పనుల్లోనే బిజీగా ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యంపైనే ప్రత్యేకంగా దృష్టి సారించి పనిచేస్తున్నామన్నారు. రాజధాని తరలింపు విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు సీఎం జగన్ తీసుకుని ముందుకు వెళ్తారని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ కూడా మూడు రాజధానుల అంశంపై సానుకూలంగా స్పందించారని మంత్రి గుర్తు చేసారు. దీంతో రాజధాని తరలింపు ప్రక్రియ తధ్యమని మరోసారి రుజువైందన్నారు. దీనిపై ప్రతిపక్షం ఎంత యాగి చేసినా? పట్టించుకునేది లేదని మరోసారి కుండబద్దలు కొట్టేసారు. అలాగే మరో మంత్రి ముత్తంశెటి శ్రీనివాస్ కూడా రాజధాని తరలింపు పై ఇటీవల విశాఖలో మాట్లాడిన సంగతి తెలిసిందే. కరోనా రాకపోయుంటే ఇప్పటికే తరలింపు ప్రక్రియ దాదాపు పూర్తయ్యేదన్నారు. ఇప్పటికే విశాఖ, కర్నూలు కు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తులు ముందుకొస్తున్నారని తెలిపారు. తొలి దఫా ప్రాజెక్ట్ లు పూర్తయితే విశాఖలో 33 వేల మందికి ఉపాధి దొరుకుతుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.