Janasenani Pawan Kalyan : జనసేనానీ చంద్రబాబు ప్రేమ మాటున కుట్ర మీకర్థమవుతోందా.?

Janasenani Pawan Kalyan : వలపు బాణాల్ని విసురుతోంది తెలుగుదేశం పార్టీ. నాన్సెన్స్.. అంటూ బెట్టు చేస్తోంది జనసేన పార్టీ. ఈ రెండు పార్టీల మధ్య ప్రేమ ఇప్పుడు కొత్తగా చిగురించిందేమీ లేదు. ప్రేమ, విరహం.. అన్నీ అయిపోయాయ్. మళ్ళీ కొత్తగా టీడీపీ నుంచి వలసు బాణాలు జనసేన వైపు దూసుకెళుతున్నాయి.

జనసేన 2019 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమవడానికి కారణం వైసీపీ మాత్రమే కాదు, టీడీపీ కూడా. నిజానికి, వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీ, జనసేనను వంచనకు గురిచేసింది. ‘జనసేన మాకు మిత్రపక్షమే..’ అని సరిగ్గా పోలింగ్‌కి కొద్ది రోజుల ముందు టీడీపీ నేతలు చేసిన ప్రచారమే జనసేనను దారుణంగా దెబ్బతీసింది. అలాగని టీడీపీ బాగుపడింది కూడా లేదు.

తాను మునిగిపోతూ, తనతోపాటు ఇతరుల్నీ ముంచేయడమెలాగో చంద్రబాబుకి బాగా తెలుసు. 2019 ఎన్నికల్లో జనసేనను అలాగే ముంచేసింది టీడీపీ. నిజానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీకి సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ప్రతిపక్ష హోదా జనసేనకు దక్కేందుకు అనుకూలమైన పరిస్థితులే ఏర్పడుతున్నాయి.

ఇది తెలిసే, చంద్రబాబు జనసేనను దెబ్బ కొట్టేందుకు వలపుబాణాల్ని విసురుతున్నారు. నిజానికి, ఈ దుష్ప్రచారాన్ని జనసేన తీవ్రంగా ఖండించాల్సి వుంది. చిత్రమేంటంటే, జనసేన తమకు మిత్రపక్షమనీ, టీడీపీ కుట్రపూరిత రాజకీయాలు చెల్లవనీ భారతీయ జనతా పార్టీ చెప్పాల్సి వస్తోంది.

ఎన్నికల వ్యూహాల నేపథ్యంలో టీడీపీతో కలిసి వైసీపీని దెబ్బకొట్టే అవకాశం వస్తే.. ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ వదులుకోకపోవచ్చు.. అన్న చర్చను టీడీపీ నేతలు లేవదీస్తున్నారు, టీడీపీ కోవర్టులైన కొందరు జనసేన మద్దతుదారులూ అభిప్రాయపడుతున్నారు. ఇది జనసేనను నిండా ముంచేస్తుందన్నది నిర్వివాదాంశం.