తెరాస కు చుక్కలు చూపించాలని బీజేపీ డిసైడ్ అయ్యినట్లు వుంది. రాబోయే ఎన్నికల్లో పీఠం దక్కించుకోవాలని కాషాయ దండు తహతలాడుతుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ హవాకు చెక్ పెట్టాలని బండి సంజయ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా యాత్రలు అనే కాన్సెప్ట్ తెరమీదకు తీసుకోని రాబోతున్నాడు.
రాజకీయాల్లో ఇప్పటికే హిట్ ఫార్మలా అయినా యాత్రలను బండి సంజయ్ బయట పెట్టాడు. 2004 సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చాడు, ఆ తర్వాత చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి 2014 లో సీఎం అయ్యాడు. ఇక జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే సూత్రాన్ని అప్లై చేసి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యాడు. ఎలా చూసుకున్న పాదయాత్ర ఫార్ములా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే వర్కౌట్ అవుతూ వస్తుంది.
ఇక తెలంగాణ పీసీసీ పదవి వస్తే పాదయాత్ర చేస్తామని కోమటిరెడ్డి మరియు రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా బండి సంజయ్ బస్సు యాత్ర చేయటానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా బస్సు యాత్ర చేసి, ఆ తర్వాత పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ పెద్దలు ఇందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు అర్ధం అవుతుంది.
మరికొద్ది రోజుల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు, 2020 జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఈ నేపథ్యంలో బీజేపీని ప్రజల్లోకి తీసుకోని వెళ్ళటానికి బస్సు యాత్రలు, పాదయాత్రలు ఒకటే మార్గాన్ని బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశ్యం కేసీఆర్ పాలన తీరును ఎండగట్టటమే అని తెలుస్తుంది.
ఒక పక్క ఖమ్మం, వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికలు, ఇంకో పక్క నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల సెగ మొదలైనట్లే లెక్క, దీనితో బండి సంజయ్ బస్సు యాత్ర ఖచ్చితంగా వీటిలో ప్రభావం చూపిస్తుంది. బస్సు యాత్రలు కూడా ఈ ప్రాంతాల గుండా సాగే విధంగా మ్యాప్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. మరి బండి సంజయ్ అమలుచేయబోతున్న ఈ సరికొత్త ఎత్తుగడకు కేసీఆర్ ఏ విధంగా చెక్ పెడుతాడో చూడాలి