Buchi Babu: ఒక్క మాటతో చెర్రీ మూవీపై అంచనాలు పెంచేసిన బుచ్చిబాబు.. అలా అడగాల్సిన పని లేదంటూ!

Buchi Babu: టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా గురించి మనందరికీ తెలిసిందే. ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బుచ్చిబాబు ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించారు బుచ్చిబాబు. అయితే ఈ సినిమా రిలీజై నాలుగేళ్లు అవుతున్నా బుచ్చిబాబు నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన రామ్‌ చరణ్‌తో సినిమా ఒక చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది.

ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. రామ్‌ చరణ్‌ కెరీర్‌లో ఇది 16వ సినిమా. ఇటీవల విడుదలైన గేమ్‌ ఛేంజర్‌ చిత్రం డిజాస్టర్‌ కావడంతో మెగా ఫ్యాన్స్‌ అంతా బుచ్చి బాబు సినిమా పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఫ్యాన్స్‌ ఊహించినదాని కంటే ఎక్కువ హిట్టే అందిస్తానని చెబుతున్నారు బుచ్చిబాబు. తాజాగా ఒక ఈవెంట్‌ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు బుచ్చిబాబు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..మా నాన్న రైతు. చాలా కష్టపడి మమ్మల్ని పెంచాడు. వ్యవసాయం గురించి మా నాన్న నాతో ఓ మాట చెప్పాడు. పేకాట ఆడితే డబ్బులు మనకో లేదా పక్కోడికో వస్తాయిరా..కానీ వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో తెలియదు..అంతా పోతాయి అని అనేవాడు.

నిజంగానే ఏడాది అంతా కష్టపడితే ఏకరం మీద రైతుకు మిగిలేది కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది అని బుచ్చిబాబు అన్నారు. అలాగే ఉప్పెన రిలీజ్‌ సమయంలో మా నాన్న థియేటర్‌ బయటే నిలబడి సినిమా బాగుందా అని వచ్చిన వారందరినీ అడిగేవారు. ఆయన సినిమా కూడా చూడకుండా థియేటర్‌ కు వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆయన మా నుంచి బౌతికంగా దూరమై ఏడాది అవుతోంది. ప్రస్తుతం నేను చరణ్‌ తో తీస్తున్న సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన పని లేదు నాన్నా.. అది కచ్చతంగా హిట్‌ అవుతుంది అని బుచ్చిబాబు ఎమోషనల్‌ గా చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది. ఇలా ఈ ఒక్క మాటతో చరణ్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశారు బుచ్చిబాబు.