ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. ఇక కొత్త సీఎం ను ఎన్నుకునేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం భేటీ కానున్నారు.ఉత్తరాఖండ్ లో 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2017లో అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టారు. అయితే, గత కొంతకాలంగా ముఖ్యమంత్రిపై సొంత పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ముఖ్యమంత్రి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నిన్నటి రోజున ఢిల్లీవెళ్లి అక్కడి నాయకులను కలిశారు. ఢిల్లీ పెద్దలను కలిసిన తరువాత అయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పార్టీలో త్రివేంద్ర సింగ్ రావత్ కు, నేతలకు మధ్య పొసగకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు కేంద్రం కూడా త్రివేంద్ర సింగ్ రావత్ ను తప్పించాలని చూసినట్టు సమాచారం.
రావత్ వ్యవహార శైలి, కేబినెట్ కూర్పులో జాప్యం పట్ల 20మంది వరకు ఎమ్మెల్యేలు,పలువురు మంత్రులు అసంతృప్తిగా ఉండటం ఈ మొత్తం వ్యవహారానికి కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా సీఎంపై పార్టీ హైకమాండ్ కు కూడా వీరు ఫిర్యాదు చేశారు. ఇక,త్రివేవంద్రసింగ్ రావత్ స్థానంలో సీఎం బాధ్యతలను ప్రస్తుతం మంత్రిగా ఉన్న ధన్ సింగ్ రావత్ చేపట్టనున్నట్లు సమాచారం. ఉదయ్ సింగ్ నగర్ జిల్లాలోని కతిమా అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పుష్కర్ సింగ్ ధమి డిప్యూటీ సీఎం అవబోతున్నట్లు సమాచారం.