నెగ్లేరియా ఫోవ్లేరీ.. ఇది ఒక సూక్ష్మక్రిమి పేరు. దాన్నే అమీబా అని కూడా అంటారు. అది ఇప్పుడు కుళాయి నీళ్లలో ఉంది. నల్లా నీళ్లలో దీన్ని గుర్తించారు. అది ఉన్న నీళ్లను తాగితే అంతే ఇక.. అది తిన్నగా మెదడులోకి చేరుకొని మెదడును తినేస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.
ఈ సూక్ష్మజీవి ఉన్న నీటిని తాగినా… ఆ నీటితో స్నానం చేసినా.. ఆ నీటిని ముట్టుకున్నా… ఆ నీటితో ఏ పని చేసినా.. అది ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి మెదడుకు వెళ్తుంది.
దాని వల్ల విపరీతంగా తలనొప్పి రావడం, వాంతులు, మతిమరుపు, చిరాకు, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని బారి నుంచి తప్పించుకోవడానికి వేడి చేసి చల్లార్చిన నీటినే తాగాలి. స్నానానికి కూడ గోరు వెచ్చని నీటిని వాడటం మంచిది. అలాగే కుళాయి నీటిని ఎక్కువగా వాడకపోవడమే బెటర్.
అయితే.. ఇప్పటికే ఈ అమీబా కారణంగా ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో యూఎస్ లోని టెక్సాస్ లో ప్రభుత్వం అలర్ట్ అయింది. వెంటనే టెక్సాస్ గవర్నర్ రాష్ట్రం మొత్తం విపత్తు ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలకు అమీబా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
టెక్సాస్ లోనే 1983 నుంచి 2010 మధ్య కాలంలో ఇదే అమీబా కారణంగా 28 మంది మృతి చెందారు. మళ్లీ తాజాగా ఈ అమీబా అదే టెక్సాస్ లో వెలుగు చూడటంతో దీని వల్ల ఎంతమంది బలవుతారో అని ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అవుతుంటే మళ్లీ ఇది కూడా బయపెడుతోంది. టెక్సాస్ ప్రజలు ఓవైపు కరోనాతో పోరాడుతూనే ఈ అమీబాతోనూ పోరాడాల్సి వస్తోంది.
ఈ అమీబా.. ఎక్కువగా చిన్న చిన్న కాల్వల వద్ద, మురికి గుంటల వద్ద, చిన్న చిన్న నీటి గుంటల వద్ద, నీటి కుళాయిల వద్ద ఉంటుంది. దీంతో ప్రజలు అటువంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.