BRAHMĀSTRA : ఫాంటసీగా ‘బ్రహ్మాస్త్రం’ మోషన్ పోస్టర్!

BRAHMĀSTRA : ఫాక్స్ స్టార్ స్టూడియోస్ తో ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ ఫస్ట్ మోషన్ పోస్టర్ ఈ రోజు ఉదయం విడుదలయింది. ప్రసిద్ధ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మాతగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మెగా బడ్జెట్ మూవీ ఫాంటసీ అడ్వెంచర్ ఎపిక్‌ గా వుండబోతోంది. దీని తెలుగు వెర్షన్ ‘బ్రహ్మాస్త్రం -మొదటి భాగం -శివ’ ఎస్ ఎస్ రాజ మౌళి సమర్పిస్తున్నారు. రణబీర్ కపూర్ త్రిశూలం పట్టుకున్న యాక్షన్ దృశ్యంతో పోస్టర్ థ్రిల్లింగ్ గా వుంది.

‘ఈ లోకంలో ఏదో జరుగుతోంది. కొన్ని విషయాలు మామూలు మనుషులకు అర్ధం గావు. కొన్ని పురాతన శక్తులున్నాయి, కొన్ని అస్త్రాలున్నాయి’ అన్నరణబీర్ డైలాగు, దీనికి సమాధానంగా, ‘అవన్నీ నీకెందుకు కనిపిస్తున్నాయి? అసలు నువ్వెవరు శివా?’ అన్న అలియా భట్ డైలాగుతో పోస్టర్ రూపు దిద్దుకుంది,

BRAHMĀSTRA Part One: Shiva | Official Motion Poster | Ayan Mukerji | In Cinemas 09.09.2022

 

2009లో ‘వేక్ అప్ సిడ్’ తో అరంగేట్రం చేసిన దర్శకుడు అయాన్ ముఖర్జీ 2011 లో హిమాలయాలను సందర్శించినప్పటి నుంచి ‘బ్రహ్మాస్త్ర’ ఆలోచన చేస్తూ గడిపాడు. స్టార్ వార్స్, హ్యారీ పోటర్, ఎవెంజర్స్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి సినిమాలు చూస్తూ పెరిగిన తను, పౌరాణిక కథలపై ఆసక్తిని కలిగి వుండడంతో బాటు, ఫాంటసీ ఫిక్షన్‌ పుస్తకాలు కూడా చదవడంతో, ‘బ్రహ్మస్త్ర’ తో బాలీవుడ్‌లో కొత్త శైలిని సృష్టించాలనుకున్నాడు. 2014 లో బ్లాక్ బస్టర్ ‘యే జవానీ హై దీవానీ’ తీశాడు. ఆ తర్వాత వెంటనే ‘బ్రహ్మాస్త్ర’ ని రూపొందించడంలో నిమగ్నమయ్యాడు. 2017 నుంచీ నాలుగేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ కొన్ని ప్రత్యేక శక్తులతో పుట్టిన శివగా కనిపించనున్నాడు. అలియా భట్ కూడా ప్రధాన పాత్రలో కన్పిస్తుంది. అమితాబ్ బచ్చన్ రణబీర్ గురువుగానూ, టెలివిజన్ స్టార్ మౌని రాయ్ విలన్‌గానూ నటిస్తుండగా, సౌత్ స్టార్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు.

సినిమా రెండు టైమ్‌ఫ్రేమ్‌లలో సెట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రధాన కథ ప్రస్తుత కాలంలో ఒక లక్ష్యం నెరవేర్చడానికి బ్రహ్మాస్త్రం వంటి ఆయుధాల గురించి తెలుసుకునే కథగా, నేపథ్య కథ మహా భారతానికి పూర్వం 3000 సంవత్సరాల క్రితం మహాశక్తి పొందిన శివ అనే యువకుడి కథగా వుంటాయి. దీన్ని3D, IMAX 3D ఫార్మాట్స్ విడుదల చేయబోతున్నారు. సంగీతం ప్రీతం, ఛాయాగ్రహణం పంకజ్ కుమార్ నిర్వహిస్తున్నారు. బడ్జెట్ 300 కోట్లు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఇప్పుడప్పుడే విడుదల కావడం లేదు. 9.9.2022 వరకూ ఆగాలి.