బ్యాక్ టూ బ్యాక్ హిట్లు ఇచ్చిన దర్శకుడైనా సరే ఒక్క ఫ్లాప్ పడింది అంటే చాలు ఇబ్బందులు పడాల్సిందే. ‘వినయ విధేయ రామ’ ముందు వరకు బోయపాటి శ్రీను రేంజ్ వేరే లెవల్లో ఉండేది. ఆయన ఒక్కసారి ఒక్క సినిమా మీదనే పనిచేస్తారు. నెక్స్ట్ ఏంటి అనేది పెద్దగా పట్టించుకోరు. స్టార్ హీరోలు సైతం ఆయనతో వర్క్ చేయడానికి రెడీగా ఉండేవారు. ఈ క్రేజ్ అంతా ఒక్క ప్లాప్ సినిమాతో గాలిలో కలిసిపోయింది. రామ్ చరణ్ హీరోగా ఆయన చేసిన ‘వినయ విధేయ రామ’ చిత్రం భారీ డిజాస్టర్ అయింది. కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ సైతం మరీ ఇంత నాసిరకం కథేమిటని మండిపడ్డారు.
ఆ ఫ్లాప్ బోయపాటి మీద పెను ప్రభావాన్ని చూపింది. ఆ సినిమా తర్వాత ఇంకో సినిమా పట్టుకోవడానికి ఆయనకు చాలా సమయమే పట్టింది. అప్పటికీ బాలకృష్ణ మాత్రమే ఆయనకు అవకాశం ఇచ్చారు. అది కూడ గతంలో ‘సింహ, లెజెండ్’ లాంటి హిట్లు ఇచ్చాడు కాబట్టి. ఎన్నడూ లేనిది బోయపాటి ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకో సినిమాను సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. అల్లు అర్జున్, రవితేజ ఇద్దరిలో ఎవరో ఒకర్ని లాక్ చేయాలని అనుకుంటున్నారు.
అయితే బన్నీ, రవితేజలు కాస్త కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే ఇద్దరూ హిట్ ట్రాక్లో ఉన్నవారే. ఇలాంటి టైంలో బోయపాటితో రిస్క్ చేయడం అవసరమా అనేది వాళ్ల అనుమానం కావొచ్చు. అందుకే ‘అఖండ’ రిజల్ట్ ఏమిటో చూసి తర్వాత డెసిషన్ తీసుకోవాలని అనుకుంటూ ఉండొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘అఖండ’ హిట్ అయితేనే బోయపాటి తిరిగి ఫామ్లోకి రాగలరు.