Akhanda Movie: ఈ మధ్య కాలంలో థియేటర్‌లో చూసిన సినిమా అఖండ అని, ఆ తర్వాత ఏమీ చూడలేదని ఆర్టిస్ట్ మానవ కోటేశ్వర రావు తెలిపారు. ఈ సినిమా తర్వాత థియేటర్లలో జై బాలయ్య అనే నినాదాలు చేస్తున్నారని చాలా మంది తనకు చెప్పినట్టు ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి తోడు దర్శకుడు బోయపాటి కూడా ఏ మాత్రం తగ్గకుండా సీన్లన్నీ టకా టకా వచ్చేటట్టు తీశారని ఆయన ప్రశంసించారు.
ఇక ఈ సినిమాకు తమన్ చేసిన బ‌్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయిందని కోటేశ్వర రావు అన్నారు. అంతేకాకుండా ఇక చాలా కొద్ది మందికే తెలిసిన విషయం ఒకటుందని, అదేంటంటే సీన్ జరిగేటపుడే డైరెక్టర్ బోయపాటి తన వాయిస్‌తో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చెప్పేవారని ఆయన తెలిపారు. అలా చాలా సందర్భాల్లో ఆయన వాయిస్‌తోనే మ్యూజిక్‌ను వాయించేవారని ఆయన చెప్పారు. బాలకృష్ణ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఓ సారి స్పందించారని, అదేంటంటే మామూలుగా అయితే ఆర్టిస్ట్ డామినేట్ చేస్తే ఇలాంటివి జరుగుతాయని, అదే డైరెక్టర్ డామినేట్ చేస్తే జరగవని ఆయన చెప్పారని కోటేశ్వర రావు గుర్తు చేశారు.
ఇకపోతే బాలకృష్ణ గారు షూటింగ్ జరుగుతున్నపుడు బ్రేకింగ్ సమయంలో ఆయన ఖాళీగా ఉంటే ఆయన దగ్గరే కూర్చోమని అంటారని కోటేశ్వర రావు తెలిపారు. ఆయన ఎక్కువగా రామారావు గురించి, సినిమాల గురించి, డైలాగుల గురించి చర్చిస్తారని కోటేశ్వర రావు అన్నారు. తనకు అత్యంత ఇష్టమైన నటుడు రామారావు అని, హీరోయిన్ సావిత్రి అని ఆయన స్పష్టం చేశారు.