చిత్రం : బ్లాక్
దర్శకత్వం : జి బి కృష్ణ
విడుదల తేదీ : మే 28, 2022
రేటింగ్ : 2/5
నటీనటులు: ఆది సాయికుమార్, దర్శన బానిక్, కౌశల్ తదితరులు
నిర్మాత: మహంకాళి దివాకర్
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల
ఎడిటర్: అమర్ రెడ్డి
టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకునేందుకు ఆది సాయి కుమార్ పడరాని పాట్లు పడుతున్నాడు. అయినా కాలం కలిసిరావడం లేదు. ఇప్పుడు ‘బ్లాక్’ రూపంలో మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జి బి కృష్ణ దర్శకత్వం లో మహంకాళి దివాకర్ నిర్మించిన చిత్రమిది. శనివారం మే 28, 2022న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే…
కథ : ఆదిత్య – అర్జున్ (ఆది సాయికుమార్) ఇద్దరు బ్రదర్స్. ఐతే, ఆదిత్య పై కోపంతో అర్జున్ చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోతాడు. మరోపక్క ఆదిత్య కానిస్టేబుల్ అవుతాడు. ఆదిత్య నైట్ షిఫ్ట్ లు చేస్తున్న క్రమంలో ఒక మర్డర్, రాబరీ జరుగుతాయి. ఆ క్రమంలో ఆదిత్యకి హానిక (దర్శన బానిక్) పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అంతలో ఆ హత్య రాబరీ ఆదిత్యనే చేసినట్లు ఆధారాలు దొరుకుతాయి. కానీ, ఆదిత్యకి వాటితో ఎలాంటి సంబంధం లేదు. చిన్నప్పుడు పారిపోయిన అర్జున్, తన పై పగతోనే తనను ఇలా ఇరికించాడు అని ఆదిత్య నమ్ముతాడు. అసలు ఆ హత్యలు ఎవరు చేశారు ? నిజంగానే అర్జున్, ఆదిత్య పై కోపంతోనే ఇదంతా చేశాడా? అసలు ఆదిత్యకి ఉన్న డిజార్డర్ ఏమిటి ? దానికి, జరుగుతున్న సంఘటనలకు ఏమైనా సంబంధం ఉందా ? అనేది మిగతా కథ.
విశ్లేషణ: సినిమా అంతా సస్పెన్స్ తో సాగినప్పటికీ పరమ బోర్ కొడుతుంది. అయితే.. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన బ్రదర్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో కొన్ని అంశాలు ఫర్వాలేదు.
హీరోగా నటించిన ఆది సాయి కుమార్ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్నిఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో నటించి తానేంటో నిరూపించాడు. ఇక హీరోయిన్ గా నటించిన దర్శన బానిక్ కూడా తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ అలరించింది. మరో కీలక పాత్రలో నటించిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మండా కూడా ఒకే అనిపించాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా బాగానే ఉంది.
స్లీపింగ్ డిజార్డర్ కి సంబంధించిన సీన్స్ కూడా ఓకే అనిపిస్తాయి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమా ప్రధాన కథలో విషయం ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది.
జరుగుతున్న హత్యలు ఎవరు చేస్తున్నారు అనే అంశంలోనే బోలెడు సస్సెన్స్ ను మెయింటైన్ చేయవచ్చు. కానీ.. చేయలేక పోయాడు దర్శకుడు. కథ, కథనం అంతా గాడి తప్పినట్టు అనిపించి ప్రేక్షకులను ముప్పుతిప్పలు పెడుతుంది. హీరో స్లీపింగ్ డిజార్డర్ ట్రాక్ లోనూ ఎక్కడా లాజిక్ లేదు. పైగా ఆ ట్రాక్ మీదే మెయిన్ ప్లాట్ మొత్తం సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది. దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి. ఒక దశలో ఇదేం సినిమా రా బాబోయ్.. అనిపిస్తుంది.
సాంకేతిక విషయాలు : ఈ ‘బ్లాక్’లో సాంకేతిక విభాగం మంచి మార్కుల్నే కొట్టేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే.. సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు బాగానే ప్లస్ అయింది. అదే విధంగా సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. ఎడిటర్ అమర్ రెడ్డి వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలోని నిర్మాత మహంకాళి దివాకర్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ ఒకే అనిపిస్తాయి. మొత్తం మీద ‘బ్లాక్’ అంటూ వచ్చిన ఈ చిత్రం కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ తో, ఫ్యూ థ్రిల్లింగ్ సీన్స్ తో కొన్నిచోట్ల పర్వాలేదనిపించినప్పటికీ ఫలితం మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆది సాయికుమార్ కు మరోసారి దెబ్బ పడ్డట్టే!