ఏపీ బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకైనా అర్థమవుతోందా.? లేదా.? అన్న అనుమానం రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. లేకపోతే, వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, వైఎస్ భారతికి ఆ పదవి కట్టబెట్టాలని బీజేపీ ఉచిత సలహా ఇవ్వడమేంటి.? బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారంపై స్పందిస్తూ, వైఎస్ భారతికి సీఎం పదవి ఇవ్వాలని కోరడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఇదెక్కడి రాజకీయం.? 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు. బీజేపీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు. అలాంటి పార్టీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో ఎవరుండాలో డిసైడ్ చేస్తుందా.? అసలు ఉచిత సలహాలు ఇచ్చే నైతిక హక్కు బీజేపీకి వుందా.? లేదా.? రఘురామ అరెస్టు వ్యవహారంలో బీజేపీ ఒకింత అత్యుత్సాహం ప్రదర్శించడం సహజమే. దానికి బలమైన కారణాలు కూడా లేకపోలేదు. రఘురామ, బీజేపీకి అత్యంత సన్నిహితుడు. ఆ కారణంగానే, తెలివిగా.. రఘురామను వైసీపీ నుంచి బయటకు రప్పించి, వైఎస్ జగన్ మీద రచ్చబండ పేరుతో విమర్శలు చేయిస్తూ వస్తోంది.
సరే, చంద్రబాబుకీ రఘురామకీ వున్న సన్నిహిత సంబంధాల వ్యవహారం వేరే చర్చ. రఘురామ అరెస్టు దుర్మార్గం.. అని బీజేపీ భావిస్తే, కేంద్రంలో అధికారంలో వున్నది బీజేపీనే గనుక.. తగిన ఆదేశాలు రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వొచ్చు. రఘురామ తనయుడు భరత్, లోక్ సభ స్పీకర్ కి కూడా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన దరిమిలా, ఢిల్లీ స్థాయిలో రఘురామను ఈ కేసు నుంచి బయట పడేందుకు చర్యలు తీసుకోవచ్చు. కానీ, రాష్ట్రం పట్ల ఏమాత్రం బాధ్యత లేనట్టు వ్యవహరిస్తున్న బీజేపీ.. జస్ట్, రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తుంటుంది. అమరావతి విషయంలో అయినా, మరో విషయంలో అయినా.. బీజేపీ తీరు ఇంతే.. బీజేపీ మారదంతే.