జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నిర్లక్ష్యం వహిస్తోంది. లేకపోతే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి ఏడేళ్ళయినా ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోవడమేంటి.? కేంద్రం ఇచ్చే నిధులతో, రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాల్సి వుంది. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు టీడీపీకి ఏటీఎంలా మారిపోయిందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు.
మరి, ఆ ఏటీఎం నుంచి గల్లంతయిన నిధుల్లో ఒక్క రూపాయినైనా మోడీ సర్కార్ వెనక్కి తీసుకురాగలిగిందా.? పోనీ, వైఎస్ జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టేందుకు వీలుగా నిధుల కొరత లేకుండా కేంద్రం చేయగలుగుతోందా.? అదీ లేదు, ఇదీ లేదు. కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై పోరాటమంటూ రంగంలోకి దిగేశారు ఏపీ బీజేపీ నేతలు. ముంపు పరిహారం బాధ్యత కేంద్రమే తీసుకోవాలి.
పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు.. ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి అంశానికీ కేంద్రమే బాధ్యత వహించాలి. అయితే, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నా, ఆ ప్రాజెక్టు ఘనత తమదేనని చెప్పుకోవడం బీజేపీకి కలిసొస్తోంది. ‘ఘనత మీదేనంటున్నారు కదా.. కేంద్రం సహకరించకుండా మీరెలా ప్రాజెక్టు నిర్మించుకుంటారో మీ ఇష్టం..’ అన్నట్టు పర్యవేక్షణ విషయంలోనూ బాధ్యతగా వ్యవహరించడంలేదు కేంద్రం.. అన్న విమర్శ వుంది.
పెండింగ్ నిధుల్ని విడుదల చేయించడంతోపాటు, ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరిగేందుకు కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ బీజేపీ పోరాడితే ఉపయోగముంటుంది. వర్షా కాలం.. గోదావరికి వరదొచ్చే సీజన్.. దాంతో, ఇప్పుడు వున్నపళంగా ప్రాజెక్టు ముంపు బాధితులకు బాసటగా.. అంటూ ఏపీ బీజేపీ చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లు.. కష్టాల్లో వున్న నిర్వాసితులకు కూడా నవ్వు తెప్పిస్తున్నాయి.