మమతా కి జై కొట్టిన బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు రాజకీయ సెగలను పుట్టిస్తున్నాయి. అటు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా మళ్లీ పీఠం దక్కించుకోవాలని సర్వశక్తులను ఒడ్డుతోంటే, ఇటు బీజేపీ కూడా ఈసారి ఎలాగైనా పశ్చిమబెంగాల్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయాలన్న పంతంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. విమర్శలకు ప్రతివిమర్శలు, రాజకీయ వ్యూహాలతో జరుగుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల పట్ల దేశమంతటా ఉత్కంఠ నెలకొంది.

కొద్ది రోజుల క్రితమే ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఓ ప్రమాదంలో ఆసుపత్రి పాలయిన సంగతి కూడా తెలిసింది. బీజేపీ నేతలు చేసిన దాడే అని తృణమూల్ పార్టీ ఆరోపిస్తోండగా, అది మమతా బెనర్జీ డ్రామా అని కాషాయ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ ఎన్నికల కలకలంలోనే ఓ బీజేపీ మాజీ సినియర్ నేత టీఎంసీలో చేరడం గమనార్హం. బీజేపీ మాజీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలంతా మమతా బెనర్జీకి అండగా ఉండాల్సిన తరుణం ఆసన్నమయిందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కలకత్తాలోని టీఎంసీ భవన్ కు స్వయంగా వెళ్లి మరీ యశ్వంత్ సిన్హా ఆ పార్టీలో చేరారు. భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి అనీ, బెంగాల్ ప్రజలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారని ఆయన అభివర్ణించారు. అకాళీదల్ పోయింది, బీజేడీ కూడా వదిలేసింది. ఇప్పుడు బీజేపీతో ఎవరు కలిసి ఉన్నారు. ఒక్కో పార్టీ బీజేపీని వదిలేస్తూ వస్తోంది. బీజేపీ పాలనలో చివరకు న్యాయశాఖ కూడా ప్రమాదంలో పడింది.‘ అని యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు.