తెలంగాణలో బీజేపీ పార్టీ ఈసారి బాగా పుంజుకుంది అని చెప్పడానికి గ్రేటర్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఎందుకంటే.. అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొని మరీ.. గ్రేటర్ లో భారీ సంఖ్యలో సీట్లు గెలవడం అనేది నిజంగా ఓ మిరాకిల్. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికలో గెలిచిన ఊపు మీదున్న బీజేపీ.. తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో చాలా ఖుషీగా ఉంది.
ఈనేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తల వీరోచిత పోరాట ఫలితంగానే ఈ విజయం లభించిందన్నారు. జీహెచ్ఎంసీలో ప్రజాసమస్యల కోసం నిరంతరం పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ బండి సంజయ్ జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కయిన ఎస్ఈసీకే ఈ విజయం అంకితం అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులను అడ్డుకోలేని డీజీపీకి కూడా ఈ విజయం అకింతమన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా గడి నుంచి బయటకు రావాలి.. అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
ఇక ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ ప్రకారం… టీఆర్ఎస్ పార్టీ 55 సీట్లలో గెలిచింది. ఒక్క సీటులో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం 43 సీట్లు గెలిచింది. బీజేపీ 44 సీట్లు గెలవగా… 5 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లలో మాత్రమే గెలిచింది.