మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం గవర్నర్ కు పంపడంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మండిపడుతోన్న సంగతి తెలిసిందే. ఏపీలో టీడీపీ ఓడిపోయిన తర్వాత బీజేపీ గూటికి చేరిన సుజనా చౌదరి మొదటి నుంచి మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. అమరావతే ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ గట్టిగానే గళం వినిపించారు. ఈ నేపథ్యంలో కేంద్రలో చక్రం తిప్పే ప్రయత్నాలు చేసారు. కానీ పనవ్వలేదు. కేంద్రం ముందే రాజధాని అనేది రాష్ర్ట ప్రభుత్వం ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని అందులో కేంద్రం చేయాల్సింది ఏదీ లేదని చెప్పింది.
ఆ లెక్కనే చంద్రబాబు నాయుడు తమకు అనుకూలమైన ప్రాంతమైన విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాతి జరిగిన రాజధాని మార్పులపై అప్పటి నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన నేతలు పార్టీ తో సంబంధం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరికి గవర్నర్ ని సైతం తప్పు బట్టే పరిస్థితి సుజనా వ్యాఖ్యలు చేరుకున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆర్టికల్ 254 ప్రకారం బిల్లుని కేంద్రానికి నివేదించాలే తప్ప ఆమోదించే ఆస్కారం, అధికారం లేదన్నారు. రాష్ర్ట విభజన చట్టం సెక్షన్ 5, 6 కి విరుద్దంగా ఉందన్నారు.
గవర్నర్ న్యాయ సమీక్ష జరపకుండా రాజ్యాంగానికి విరుద్దంగా ఏ నిర్ణయం తీసుకోరని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము విర్రాజు ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ వేసారు. రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్దం. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి. కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదు` అని ట్వీట్ చేసారు. దీంతో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు మధ్య క్లారిటీ లోపిచిందనే తెలుస్తోంది. ఇప్పుడీ అంశం రాజకీయ వర్గాల్లో చర్యనీయాశంగా మారింది. ఇక ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అయితే ఈ విషయంలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.