తెలంగాణలో బీజేపీ ఫైర్ బ్రాండ్ అంటే రఘునందన్ రావే. తెలంగాణలో ప్రస్తుతం కాస్తోకూస్తో బీజేపీ పార్టీ మనుగడలో ఉన్నదంటే దానికి రఘునందన్ రావు కూడా ఒక కారణం. ప్రత్యర్థులు ఎటువంటి వాళ్లు అయినా.. ఎంతటి వాళ్లు అయినా.. వాళ్లపై విమర్శల వర్షం గుప్పించడంలో రఘునందన్ ను మించిన వాళ్లు లేరు.
ఏ ప్రశ్నకైనా ఎదుటివారు నోరు మెదపకుండా సమాధానం చెప్పగల సత్తా ఉన్న నేత రఘునందన్ రావు. ఆయనకు తెలంగాణలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. కానీ.. ఎందుకో ఎన్నికల్లో మాత్రం ఆయన గెలుపు రుచిని చూడలేకపోతున్నారు. వరుసగా ఓటములే ఆయన్ను వెంటాడుతున్నాయి.
తెలంగాణలో త్వరలోనే ఉపఎన్నిక రాబోతున్న సంగతి తెలిసిందే. దుబ్బాక ఎమ్మెల్యే ఆకస్మిక మరణంతో ఆయన స్థానంలో ఉపఎన్నిక రాబోతుంది. అలాగే గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికలు కూడా త్వరలోనే రానున్నాయి. దీంతో తెలంగాణలో మళ్లీ ఎన్నికల వాతావరణం రాబోతున్నది.
అయితే.. దుబ్బాక ఉపఎన్నికను అన్ని పార్టీలు చాలెంజింగ్ గా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా దుబ్బాకను మరోసారి కైవసం చేసుకునేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా నువ్వా.. నేనా..అన్నట్టుగానే పోటీకి దిగుతున్నాయి.
ఈ ఎన్నికలో గెలిచి తమ పార్టీ సత్తా చూపించాలని కాంగ్రెస్, బీజేపీలు ఉబలాటపడుతున్నాయి. అందుకే.. ఈ ఎన్నిక ప్రతి పార్టీకి ప్రతిష్ఠాత్మకమైంది.
కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ఫైర్ బ్రాండ్ విజయశాంతి పేరు వినిపించింది. కానీ.. ఆమె పేరు ఫైనలైజ్ కాలేదు. తాను ఈసారి ఎన్నికలో పోటీ చేయనని విజయశాంతి కాంగ్రెస్ అధిష్ఠానానికి చెప్పినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ నుంచి కూడా పేరున్న నేతనే దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక బీజేపీ నుంచి మాత్రం రఘునందన్ రావుకే టికెట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. 2018 ఎన్నికల్లోనూ బీజేపీ తరుపున రఘునందన్ రావే పోటీ చేశారు. కానీ.. రామలింగారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆయన ఓడిపోతున్నా సరే.. నిత్యం ప్రజల్లోనే ఉంటారు. ఉంటున్నారు. అందుకే.. ఈసారి ఆయనకు సానుభూతి వర్కవుట్ అవుతుందేమో అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎలాగైనా ఈసారి టీఆర్ఎస్ పార్టీని ఓడించి.. బీజేపీ దుబ్బాకలో గెలవాల్సిందేనని పట్టుపట్టారట. అందుకే ఇప్పటికే రఘునందన్ రావు ప్రచారం ప్రారంభించేశారు.