ప్రస్తుతం తెలంగాణలో ఓవైపు ఎన్నికల వాతావరణం నెలకొనగా.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ప్రతి చిన్నవిషయానికి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తుండటంతో ఇదే ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశమైంది.
తాజాగా… పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా ప్రతిపక్ష పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశాయి.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పాలమూరు రంగారెడ్డి.. బ్లాస్టింగ్ ల వల్ల కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లు మునిగిపోయాయని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఏ ప్రాజెక్టునూ పట్టించుకోవడం. ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు? అసలు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అన్ని లక్షల ఎకరాలకు సాగు నీరు ఎలా ఇస్తారు. ఇంకెప్పుడు ప్రాజెక్టులను పూర్తి చేస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓవైపు ఇంజినీర్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. నివేదికను తుంగలో తొక్కింది. సీఎం కేసీఆర్ అన్నింటినీ పెడచెవిన పెట్టి.. తనకు నచ్చింది చేస్తూ పోతారు. పాలమూరు బ్లాస్టింగ్ ల వల్ల కల్వకుర్తికి ప్రమాదం వాటిల్లుతుందని.. ఇంజనీర్లు హెచ్చరించినా పట్టించుకోలేదు.. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకే చెందిన మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పాటు.. సీఎంకు లేఖ రాసినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఆమె గుర్తు చేశారు.
ఓపెన్ కట్ పంప్ హౌస్ ను కమిషన్ల కోసమే అండర్ గ్రౌండ్ పంప్ సెట్ గా మార్చేశారు. అక్కడ ఎటువంటి అక్రమాలకు పాల్పడకపోతే.. మమ్మల్ని ఎందుకు అక్కడికి వెళ్లనీయడం లేదు. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు.. అంటూ అరుణ మండిపడ్డారు.