మెగాస్టార్ చిరంజీవిపై మళ్ళీ బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందా.?

BJP Eyes On Mega Star Chiranjeevi?

BJP Eyes On Mega Star Chiranjeevi?

రాజకీయాలకు తాను దూరంగా వున్నట్టు మెగాస్టార్ చిరంజీవి పదే పదే చెబుతున్నారు. మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశమూ లేదని కుండబద్దలుగొట్టేస్తున్నారు. అయితే, చిరంజీవిని తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు మాత్రం తెరవెనుకాల గట్టిగానే జరుగుతున్నాయి. ప్రధానంగా ఏపీ బీజేపీ నేతలు కొందరు చిరంజీవి మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. అదే సమయంలో బీజేపీ అధిష్టానంలో కొందరు సీనియర్ నేతలు కూడా చిరంజీవితో వీలు చిక్కినప్పుడల్లా ఈ విషయమై మంతనాలు జరుపుతున్నారట. తాజాగా ఓ కేంద్ర మంత్రి ఇటీవల చిరంజీవితో రాజకీయాల గురించి చర్చించారనీ, బీజేపీలోకి రావాల్సిందిగా ఆహ్వానం పలికారనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, చిరంజీవి మాత్రం ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారట.

ఏ రాజకీయ పార్టీకీ తాను ప్రస్తుతం అనుబంధంగా లేననీ, అన్ని రాజకీయ పార్టీలతోనూ సత్సంబంధాలు తనకున్నాయనీ చిరంజీవి సదరు బీజేపీ నేతతో చెప్పారట. అయినాగానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావడమే మంచిదంటూ ఆ బీజేపీ నేత, చిరంజీవిపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. తాజాగా తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్, బీజేపీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్ళగా, ఆ సందర్భంలో కూడా చిరంజీవి ప్రస్తావన వచ్చిందంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క, చిరంజీవి కరోనా నేపథ్యంలో తనవంతుగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నా ఆయనకు తగిన గుర్తింపుని ఇవ్వడంలేదు తెలుగు మీడియా. ఈ అంశంపై బీజేపీ నేతల్లో కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు కొన్ని మీడియా సంస్థల మీద. చిరంజీవి మీద స్పెషల్ ఫోకస్ పెట్టడమంటే, పవన్ కళ్యాణ్ మీద బీజేపీకి ఆశలు సన్నగిల్లాయని అనుకోవచ్చా.? ఏమో మరి.!