రేవంత్ రెడ్డి… తెలంగాణ ఫైర్ బ్రాండ్. కాంగ్రెస్ లో ఎవరైనా గట్టి నాయకుడు ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డినే. ఆయనకు తెలంగాణలో ఉన్న క్రేజే వేరు. సీఎం కేసీఆర్ ను, ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా విమర్శించే సత్తా ఉన్న నాయకుడు. తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు రేవంత్ రెడ్డి.
ఆయనకు కాంగ్రెస్ లోనూ మంచి స్థానమే ఉంది. కాకపోతే.. రేవంత్ కు పీసీసీ అధ్యక్షుడి పదవి కావాలని ఆశ. కానీ.. ఇప్పట్లో ఉత్తమ్ దాన్ని వదిలేలా లేరు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోంది. కారణమేంటో తెలియదు కానీ.. పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతోంది.
మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే ఇప్పుడు బీజేపీనే. ఆ విషయం మొన్నటి దుబ్బాక ఉపఎన్నికల్లోనే తెలిసిపోయింది. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీని ఓడించి… తెలంగాణలో అధికారం సాధించే విధంగా బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.
అందుకే… కాంగ్రెస్ లో ఉన్న బలమైన నాయకులను బీజేపీలో చేర్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది. బీజేపీ నెక్స్ ట్ టార్గెట్ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించడం. దానికోసం మరింతగా కృషి చేస్తోంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిపై ఫోకస్ పెట్టింది. ఆయన్ను బీజేపీలోకి లాక్కోవడానికి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టిందట.
నిజానికి.. దుబ్బాక ఉపఎన్నిక సమయంలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు వచ్చినా.. అది జరగలేదు. కానీ.. గ్రేటర్ ఎన్నికల సమయంలో రేవంత్ లాంటి దమ్మున్న నాయకుడు కావాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోందట. బీజేపీ సీనియర్ నాయకుల రేవంత్ తో టచ్ లో కూడా ఉన్నారట.
ఒకవేళ.. రేవంత్ కనుక బీజేపీలో చేరితే… తెలంగాణలో కాంగ్రెస్ నామరూపం లేకుండా పోవడమే కాదు.. టీఆర్ఎస్ ఖేల్ కూడా ఖతమైపోతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకే ఎక్కువ చాన్సెస్ ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.