సౌత్ ఇండియాలో బలపడాలని బీజేపీ ఎంతో ఆరాటపడుతోంది. కానీ.. కర్ణాటకలో మినహా మిగితా సౌత్ ఇండియా రాష్ట్రాల్లో బీజేపీ పప్పులేవీ ఉడకడం లేదు. ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన దగ్గుబాటి పురందేశ్వరి కూడా సౌత్ ఇండియాలో బలపడటమే బీజేపీ తక్షణ కర్తవ్యమని చెప్పుకొచ్చారు.
అయితే.. నార్త్ ఇండియాలోలా.. సౌత్ లో పావులు కదపడం అంత వీజీ కాదు. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఎక్కువ. ప్రాంతీయ పార్టీలను తోసిరాజని బీజేపీ ఇక్కడ మనుగడ సాధించాలంటే ప్రాంతీయంగా పలుకుబడి ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకుంటేనే ఆ కల నెరవేరుతుంది.
సౌత్ లో ముందు తెలంగాణ, ఏపీలో బలపడటానికి బీజేపీ తెగ ఆరాటపడుతోంది. తెలంగాణ రాజకీయాలను గమనిస్తే.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పాతుకుపోయింది. ఇప్పటంతలో ఆ పార్టీ తెలంగాణను వదిలేలా లేదు. వేరే ఏ పార్టీ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ ను ఢీకొనలేకపోతున్నాయి. దశాబ్దాల నుంచి తెలంగాణను పాలించిన కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కూడా టీఆర్ఎస్ ముందు కుదేలయ్యాయి.
దీంతో తెలంగాణలో ఎలా బలపడాలో బీజేపీకి అర్థం కావడం లేదు. అందులోనూ గతంలో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని ఎదుర్కొంటోంది బీజేపీ.
అందుకే.. ఎలాగైనా తెలంగాణలోని మాస్ అండ్ క్లాస్ లీడర్లను తమవైపు తిప్పుకోవాలని భావిస్తోంది బీజేపీ. ఇప్పటికే పలువురు నేతలకు బీజేపీ గాలం వేసినప్పటికీ.. ముఖ్యంగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ దృష్టి సారించిందట.
తెలంగాణ సీఎం కేసీఆర్ ను కానీ.. కేటీఆర్ ను కానీ.. టీఆర్ఎస్ పార్టీని కానీ.. తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ.. విమర్శించాలంటే రేవంత్ రెడ్డి తర్వాతే ఎవ్వరైనా? వాళ్లను గుక్క.. తిప్పుకోకుండా చేయాలంటే రేవంత్ రెడ్డే కరెక్ట్. ఇప్పటికే ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అందులోనూ తెలంగాణలో అంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న నాయకుడు రేవంత్.
అందుకే.. బీజేపీ రేవంత్ రెడ్డిని.. పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తోందట. కానీ.. రేవంత్ రెడ్డి పార్టీలోకి వస్తారా? రారా? అనేది మాత్రం సస్పెన్స్ గా ఉన్నప్పటికీ.. ఒకవేళ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే.. బీజేపీ పార్టీ తెలంగాణలో పుంజుకోవడం మాత్రం ఖాయం. అందులోనూ రేవంత్ రెడ్డికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతగా మద్దతు లేదు. కానీ.. బీజేపీలో ఆయనకు సరైన మద్దతు లభిస్తే.. టీఆర్ఎస్ పార్టీపై ఒక రేంజ్ లో విరుచుకుపడటం ఖాయం. ఈ దెబ్బతో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఖేత్ ఖతమయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.