మెగాస్టార్ చిరంజీవితో మళ్ళీ చర్చలు మొదలెట్టిన బీజేపీ.?

మెగాస్టార్ చిరంజీవిని బీజేపీలోకి లాక్కెళ్ళేందుకు భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే వున్నారు. ఇటీవల భీమవరంలో చిరంజీవి, ప్రధాని నరేంద్ర మోడీ ఒకే వేదికపై కలుసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి భుజాలు పట్టుకుని మరీ నరేంద్ర మోడీ కొన్ని సెకెండ్ల పాటు ‘మాట్లాడారు’. ఆ మాటల్లో రాజకీయ అంశాలు చర్చకు వచ్చి వుంటాయని అనుకోలేం.!

అయితే, చాలాకాలంగా చిరంజీవి దగ్గరకు నరేంద్ర మోడీ దూతలుగా చెప్పబడుతోన్న పలువురు బీజేపీ కీలక నేతలు వచ్చి వెళుతున్నారు. ‘అబ్బే, మాది మర్యాదపూర్వక భేటీనే..’ అని ఆయా బీజేపీ నేతలు చెప్పడం చూశాం. చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీని పెట్టి, ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా చిరంజీవి పని చేసిన విషయం విదితమే.

‘ఈ రాజకీయాల్లో నేనుండలేను..’ అనుకుంటూ రాజకీయాలకు దూరమయ్యారు చిరంజీవి. తిరిగి రాజకీయాల్లోకి వెళ్ళే ప్రసక్తే లేదని పదే పదే చెబుతున్నారాయన. సోదరుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీకి చిరంజీవి ఏ రకంగానూ మద్దతు పలకలేదు. అలాంటిది బీజేపీతో ఆయన కలిసి నడుస్తారా.? అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయమే.

అయితే, ఏదో ఒక రూపంలో బీజేపీకి చిరంజీవి సేవలు అవసరమన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలతోనూ సన్నిహిత సంబంధాల్ని ఆశిస్తున్న చిరంజీవి, అదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలతోనూ సమదూరం పాటిస్తున్నారు.

ఇదిలా వుంటే, తాజాగా ఇంకోసారి చర్చల పర్వం షురూ అయ్యిందనీ, పలువురు ఢిల్లీ స్థాయి నాయకులు చిరంజీవితో మంతనాలు జరుపుతున్నారనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. చిరంజీవి మెత్తబడితే స్వయానా నరేంద్ర మోడీ, హైద్రాబాద్ వచ్చి ఆయన్ని కలిసే అవకాశం కూడా లేకపోలేదట.