‘వకీల్ సాబ్’ అంత పెద్ద హిట్ అయ్యిందా.?

రాజకీయ, సినీ విమర్శల వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే, ‘వకీల్ సాబ్’ సినిమా వసూళ్ళ లెక్క. వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘వకీల్ సాబ్’ సినిమాకి 56 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్లుగా వెల్లడించారు. ‘అధికారిక లెక్క ఇదీ..’ అంటూ నాని పేర్కొనడం గమనార్హం. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ‘వకీల్ సాబ్’ సినిమాకి ఎక్కువ షేర్ వచ్చిందని పేర్ని నాని చెప్పుకొచ్చారు. నిజానికి, తెలంగాణలోనూ ‘వకీల్ సాబ్’ సినిమా బాగానే ఆడింది. కరోనా పాండమిక్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో పెట్టిన ఇబ్బందుల నడుమ, ‘వకీల్ సాబ్’ సినిమాకి తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్‌లో వసూళ్ళు (షేర్ పరంగా) తక్కువ వచ్చాయని అంతా అనుకున్నారు.

ఎప్పుడైతే పేర్ని నాని, 56 కోట్లు.. అని ప్రకటించారో.. తెలంగాణ లెక్క కలిపి, వంద కోట్లకు పైగానే షేర్.. అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. అసలు లెక్క ఎంత.? అన్నది నిర్మాతకి తెలుసు. నిర్మాత ఎలాగూ అధికారిక లెక్కలు విడుదల చేయడం జరగదు. ట్యాక్స్ సమస్యలు వంటివి వుంటాయ్ మరి. తమ సినిమాలు అద్భుత వసూళ్ళను సాధించాయంటూ, పబ్లిసిటీలో భాగంగా చెప్పుకోవడం మినహా.. అధికారిక లెక్కలు వుండవు.. దాదాపు ఏ సినిమా విషయంలోనూ. కానీ, ఇప్పుడు ‘వకీల్ సాబ్’ లెక్క బయటకు వచ్చింది. 50 కోట్లకు అటూ ఇటూగా మాత్రమే ‘వకీల్ సాబ్’ షేర్ వచ్చిందని ఇతర హీరోల అభిమానులు ట్రోల్ చేస్తూ వచ్చారు ఇప్పటిదాకా. కానీ, ఇకపై సీన్ మారనుంది. ఏదో విషయంపై రచ్చ జరిగితే, ఇంకోటేదో విషయంలో పవన్ కళ్యాణ్‌కి కలిసి రావడం యాదృశ్చికమనుకోవాలా.?