Bheemla Nayak : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లానాయక్’ ఇచ్చిన షాక్ తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. శర్వానంద్, రష్మిక మండన్న జంటగా నటించిన ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, అలాగే వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘గని’ చిత్రాలు ఈ నెల 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
శర్వానంద్ మెగా కాంపౌండ్‌కి అత్యంత సన్నిహితుడైన హీరో. వరుణ్ అయితే మెగా హీరోనే. మరి, పవన్ కళ్యాణ్ ఎందుకు ఫిబ్రవరి 25న తన సినిమా ‘భీమ్లానాయక్’ని తీసుకొస్తున్నాడు.? ఆ రెండు సినిమాలకి తన సినిమా నుంచి ‘థ్రెట్’ వుంటుందని పవన్ ఎందుకు ఆలోచించలేకపోయాడు.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి.
నిజానికి, ‘భీమ్లానాయక్’ ఫిబ్రవరి 25న విడుదలవుతుందని గతంలోనే ప్రకటన వచ్చింది. అయితే, కోవిడ్ పాండమిక్ సహా అనేక కారణాలతో ‘భీమ్లానాయాక్’ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కొందరు నిర్మాతలు రంగంలోకి దిగి, ‘భీమ్లానాయక్’ని ఫిబ్రవరికి వాయిదా వేయించిన మాట వాస్తవం.
అలాంటప్పుడు, ‘భీమ్లానాయక్’ సినిమాతో సంప్రదింపులు జరపకుండా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా అయినా, ‘గని’ సినిమా అయినా ఎలా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసినట్లు.?
ఎలాగైనా, ‘భీమ్లానాయక్’ని తొక్కేయాలన్న కుట్ర అయితే సినీ పరిశ్రమలో జరుగుతోంది. ఇదే భావన కొందరు రాజకీయాల్లోనూ వుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అందుక్కారణం పవన్ కళ్యాణ్, జనసేన అధినేత కావడమేనన్నది పవన్ అభిమానుల వాదన.
కారణాలేవైతేనేం, ‘భీమ్లానాయక్’ షాక్ ఇచ్చాడన్న ప్రచారం జరుగుతోందిగానీ, నిజానికి.. ‘భీమ్లానాయక్’కి మిగతా సినిమాలు షాక్ ఇచ్చాయనడం సబబేమో.