Bheemla Nayak : ‘భీమ్లానాయక్’ ఇలా చేశాడేంటి సామీ.?

Bheemla Nayak : అభిమానులు చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు ‘భీమ్లానాయక్’ సినిమా మీద. సంక్రాంతికి రావాల్సిన ‘భీమ్లానాయక్’ అనూహ్యంగా ఫిబ్రవరి నెలాఖరుకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ‘భీమ్లానాయక్’ నిర్మాతలు కాకుండా, మరో రెండు సినిమాల నిర్మాతలు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ‘భీమ్లానాయక్’ సినిమా విడుదల వాయిదాపై ప్రకటన చేయడాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

‘ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే సినిమాని తీసుకొస్తాం..’ అని ‘భీమ్లా నాయక్’ పదే పదే ప్రకటనలు చేస్తూ వచ్చారు. దాంతో, అభిమానులు సంక్రాంతికి రాబోయే తమ అభిమాన హీరో సినిమా కోసం ముందస్తు ఏర్పాట్లు గట్టిగానే చేసుకున్నారు. దాంతో, ఇప్పుడు వాళ్ళంతా ఉస్సూరుమంటున్నారు.

మరీ ముఖ్యంగా విదేశాల్లో వున్న పవన్ అభిమానులు, ఈ సంక్రాంతికి స్వదేశంలో.. సొంత ఊళ్ళలో ‘భీమ్లానాయక్’ సినిమాని చూసేందుకు ఏర్పాట్లు చేసేసుకున్నారు. సినిమా వాయిదా పడ్డంతో వాళ్ళ ఆవేదన అంతా ఇంతా కాదు.

ఇదిలా వుంటే, ఏపీ సర్కారుతో పవన్ కళ్యాణ్ రాజకీయ వైరం నేపథ్యంలో ఈ సంక్రాంతి ఇటు సినిమా పరంగా, అటు రాజకీయాల పరంగా చాలా ప్రత్యేకంగా వుండబోతోందని పవన్ అభిమానులు, జనసైనికులే కాదు.. ఇటు సినీ పరిశ్రమలోనూ అటు, రాజకీయ వర్గాల్లోనూ చాలా ఉత్కంఠ నెలకొంది.

టిక్కెట్ల ధరల వ్యవహారం సహా, అనేక అంశాలకు సంబంధించి ‘అమీ తుమీ’ తేల్చుకోవడానికి ‘భీమ్లానాయక్’ సంక్రాంతి రిలీజ్ సరైన వేదిక అనే భావనలో చాలామంది వున్నారు. కానీ, ‘భీమ్లానాయక్’ సినిమా వాయిదా ప్రకటనతో, అంతా ఒక్కసారిగా డీలా పడుతున్నారు. ‘భీమ్లానాయక్’ నిర్మాత మీదనే కాదు, ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ నిర్మాతలపైనా పవన్ అభిమానులు విరుచుకుపడుతున్నారు.