Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ని అలా వెనక్కి నెట్టేశారు.!

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ వైపు వుంటారా.? సినీ పరిశ్రమ వైపు వుంటారా.? అని ప్రశ్నించాడో సినీ మేధావి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకీ, సినీ పరిశ్రమకీ సంబంధం లేదంటూ పరిశ్రమ పెద్దలుగా చెప్పబడుతున్న కొందరు ప్రకటన కూడా విడుదల చేసేశారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద సినిమా టిక్కెట్ ధరల విషయమై పవన్ కళ్యాణ్, ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సృష్టించిన ప్రకంపనల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే.

కానీ, సినీ పరిశ్రమకు సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపుతో 00వచ్చే నష్టమేంటో అందరికీ తెలిసొచ్చింది. ఎవడికి నొప్పి తగిలితే వాడే ఏడుస్తాడన్న చందాన.. ఆయా సినిమాల నిర్మాతలు, నటులు.. తమ తమ సినిమాల విడుదల నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్నే స్మరించారు. పవన్ ముందు చూపుతో చేసిన వ్యాఖ్యల్ని అప్పుడే సినీ పరిశ్రమ సమర్థించి వుంటే, ఇప్పుడు పరిస్థితి ఇంకోలా వుండేది.

అయితే, పరిశ్రమకు ఎప్పుడు అవసరం వచ్చినా, పవన్ కళ్యాణ్ ముందుంటాడు. సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ని పరిశ్రమ ప్రముఖులు విజ్ఞప్తి చేశారట. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జనవరి 7న విడుదలవుతుండగా, జనవరి 14న ‘రాధేశ్యామ్’ విడుదలవుతోంది. మధ్యలో.. ‘భీమ్లా నాయక్’ విడుదల కావాలి. కానీ, పరిశ్రమ పెద్దలంతా పవన్ కళ్యాణ్‌ని ఒప్పించారు.

నిజానికి, ఈ సమయంలో ‘ససేమిరా’ అనాల్సిన పవన్ కళ్యాణ్, పెద్ద మనసుతో నిర్ణయం తీసుకున్నారు. ‘భీమ్లానాయక్’ నిర్మాతలు కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందించారు. ఓ సినిమా రిలీజ్ విషయమై ఇంత కలిసికట్టుగా వున్న సినీ పరిశ్రమ, సినిమా టిక్కెట్ల ధరల అంశంపై ఎందుకు ఒక్కతాటిపైకి రాలేకపోయింది.? అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే.

నిజానికి, పవన్ కళ్యాణ్‌ని ఒప్పించేందుకు, పవన్ వద్దకు వెళ్ళి మాట్లాడేందుకూ సోకాల్డ్ పెద్దలు తటపటాయించాల్సి వచ్చిందట. గతంలో వాళ్ళంతా చేసిన ఓవరాక్షన్ అలాంటిది.