బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఎలాంటి సందర్భంలో అయినా పవన్ నా దేవుడు అనే వ్యక్తి. సోషల్ మీడియాలో నిత్యం పవన్ మీద పొగడ్తలు కురిపించే బండ్ల బహిరంగ వేదికల మీద చెలరేగిపోతాడు. చేతికి మైక్ దొరికితే పూనకమొచ్చినట్టు పొగిడేస్తుంటాడు. మొదట్లో పవన్, బండ్ల నడుమ అన్ని టర్మ్స్ బాగానే ఉండేవి. కానీ ఎప్పుడైతే బండ్ల కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడో అభిమానాలు కూడ ఆయన్ను వేరుగా చూడటం స్టార్ట్ చేశారు. చివరికి రాజకీయాల నుండి విరమించుకోవడంతో బండ్ల మళ్లీ పవన్ కు దగ్గరవ్వడం స్టార్ట్ చేశారు.
పవన్ తో మళ్ళీ ఒక సినిమా చేయాలనేది బండ్ల టార్గెట్. అదే మళ్ళీ తనకు స్టార్ నిర్మాతగా పేరు తెస్తుంది. అందుకే నిత్యం పవన్ తో టచ్లో ఉంటున్నారు. పవన్ ఏ సినిమా షూటింగ్ సెట్లో చూసినా బండ్ల దర్శనమిస్తున్నాడు. అయినా పవన్ నుండి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు లేదు. అందుకే ఈసారి డోస్ పెంచాడు. ‘వకీల్ సాబ్’ వేడుకలో రెచ్చిపోయాడు. ‘ ఆ ఏడు కొండల వాడికి అన్నమయ్య., శివుడికి భక్తకన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్‌కల్యాణ్‌కు బండ్ల గణేష్’ అంటూ పెద్ద మాటలే మాట్లాడాడు. పవన్ పొగరు గురించి దాదాపు రెండు నిముషాల డైలాగ్ చెప్పేశాడు. బండ్ల మాటలు విన్నాక పవన్ ఛాన్స్ ఇవ్వాల్సిందే అన్నట్టు ఉన్నాయి. పవన్ కూడ బండ్ల మాటల్ని బాగా ఎంజాయ్ చేశాడు. మరి ఆ ఆనందంలోనే బండ్లకు నిర్మాతగా ఇంకొక అవకాశం ఇస్తాడేమో చూడాలి.