తన రేంజ్ చాలా పెద్దదన్నట్టు, ‘మా’ వ్యవహారం చాలా చిన్నదన్నట్టు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. సినీ పరిశ్రమలో బాలయ్య కూడా ఓ అగ్రహీరో. నటుడే కాదు, నిర్మాత కూడా.
స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రస్తావన లేకుండా, తెలుగు సినిమా గురించి మాట్లాడుకోలేం. అలాంటి మహానుభావుడి తనయుడు నందమూరి బాలకృష్ణ. సినీ పరిశ్రమలో అవాంఛనీయ ఘటనలు జరుగుతోంటే, బాలయ్యకు బాధ్యత లేదా.? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై బాలయ్య నిన్న చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది.
ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు, ఎకరం భూమిని అసోసియేషన్ కోసం సాధించలేరా.? అని బాలయ్య నిలదీసేశారు. చిరంజీవి, నాగార్జున సహా పలువురు ప్రముఖులు ఇటీవల పలు సందర్భాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌తో భేటీ అవడంపైనే బాలయ్య ఇలా వ్యాఖ్యానించి వుండొచ్చు.
తనను ఎమ్మెల్యేగా గెలిపించిన హిందూపూర్ నియోజకవర్గ ప్రజలకే బాలయ్య అందుబాటులో వుండడంలేదు.. అలాంటిది, సినీ పరిశ్రమ వ్యవహారాలకు ఎలా ఆయన అందుబాటులో వుంటారన్నది ఇంకో చర్చ.
సినీ పరిశ్రమను గాజు భవనంగా ఆయనే అభివర్ణిస్తున్నారు. అలాంటప్పుడు, అదే సినీ పరిశ్రమ గురించి తేలిక వ్యాఖ్యలు చేసేముందు బాలయ్య ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి కదా.? క్యాన్సర్ ఆసుపత్రి వ్యవహారాల నిమిత్తం బాలయ్య, తెలంగాణ ముఖ్యమంత్రిని కలుస్తారు.
మరి, సినీ పరిశ్రమ వ్యవహారాల నిమిత్తం ఎందుకు కలవరు.? ఉద్దేశ్యపూర్వకంగానో, లేదంటే అనుకోకుండానో.. ఎలాగైతేనేం, బాలయ్య ‘మా’ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో చాలామందికి నచ్చలేదు. బాలయ్యే స్వయంగా ‘మా’ ఎన్నికల వ్యవహారాన్ని పట్టించుకోవచ్చు కదా.? అన్న వాదన సినీ పరిశ్రమ నుంచీ వినిపిస్తోంది.