కరోనా సెకండ్ వేవ్ చూస్తుండగానే భయంకరంగా మారింది. మొదట్లో లైట్ తీసుకున్న సినీ ఇండస్ట్రీ కొన్ని దెబ్బలు తగిలాక కానీ తెలుసుకోలేకపోయింది. ఇప్పటికే తమిళ, తెలుగు ఇండస్ట్రీలో పలువురు వైరస్ బారినపడి కన్నుమూశారు. టాలీవుడ్లోనే అనేక మంది స్టార్ నటీనటులు కరోనాకు గురయ్యారు. దీంతో అన్ని సినిమాలు నిలిచిపోయాయి. ఏవో రెండు మూడు చిత్రాలు తప్ప సెట్స్ మీద ఏవీ లేవు. అందరు హీరోలు ఇళ్లకే పరిమితమయ్యారు. మొదట్లో ‘పుష్ప’ లాంటి చిత్ర బృందాలు ధైర్యం చేసినా ఇప్పుడు వెనక్కు తగ్గక తప్పలేదు.
యంగ్ హీరోలు అందరూ పరిస్థితులు చక్కబడ్డాకనే చేసుకోవచ్చని సైలెంట్ అయిపోయారు. ఇక సీనియర్ హీరోల సంగతి చెప్పనక్కర్లేదు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు లాంటి వాళ్లంతా ఉన్నపళంగా సినిమాలను ఆపేసుకున్నారు. ఎందుకంటే వైరస్ మూలంగా వయసు పైబడిన వారికే రిస్క్ ఎక్కువగా ఉంటోంది. వ్యాక్సిన్ తీసుకున్నా కోవిడ్ సోకదనే గ్యారెంటీ లేదు. ఇలా ఆరు పదుల వయసులో ప్రమాదానికి ఎదురెళ్ళడం ఎందుకని ఆగిపోయారు. కానీ నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం రిస్క్ తీసుకునేలా ఉన్నారు.
ప్రస్తుతం ఆయన బోయపాటితో చేస్తున్న ‘అఖండ’ షెడ్యూల్ బ్రేక్లో ఉంది. ఇంకో 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుంది. దాన్ని కంప్లీట్ చేస్తే పోస్ట్ ప్రొడక్షన్లోకి వెళ్లిపోవచ్చనేది బోయపాటి ఆలోచనట. బాలయ్య కూడ ఇందుకు సై అంటున్నారట. దీన్నిబట్టి ఈ నెలలోనే బాలయ్య సెట్స్ మీదకు వెళ్లి షూటింగ్ చేసే అవకాశాలున్నాయి. అయినా ఇలాంటి విపత్కర సమయాల్లో బాలయ్య లాంటి సీనియర్ హీరో రిస్క్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మహా అయితే సినిమా నెల లేదా రెండు నెలలు ఆలస్యం అవుతుందేమో. అంతమాత్రం దానికి లైఫ్ రిస్క్ చేయడం భావ్యం కాదు కదా.