తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది చేసినా సంచనలమే ఉంటుంది. ఇది వరకు ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాన్ని ఆయన తీసుకుంటారు. ఆయన ఏది చేపట్ఠినా అంతే.. పథకాలు కూడా అంతే. ఇప్పటి వరకు లేని పథకాలను ఆయన ప్రారంభిస్తారు. పాలనలో కొత్తదనాన్ని చూపించాలంటే తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా?
ఇక.. అసలు విషయానికి వస్తే.. కేసీఆర్ ను.. టాలీవుడ్ హీరో బాలకృష్ణ పొగడ్తల్ ముంచెత్తారు. అసలు.. వీళ్లిద్దరు ఎప్పుడు కలిశారు. అయినా కేసీఆర్ ను పొగడాల్సిన అవసరం బాలకృష్ణకు ఎందుకొచ్చిందనేగా మీ డౌట్.
సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని భవిష్యత్తు తరాలకు తెలిసేలా… తెలంగాణ పాఠ్య పుస్తకాల్లోని పదో తరగతి పుస్తకంలో ప్రచురించారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకొని.. ఒక మహోన్నత వ్యక్తి జీవితాన్ని భవిష్యత్తు తరాలకు తెలిసేలా చేసిన సీఎం కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు చెప్పారు.
ఫేస్ బుక్ ద్వారా బాలకృష్ణ స్పందించారు. పుస్తకాల్లో ఎన్టీఆర్ గురించి ప్రచురించిన పేజీలను కూడా బాలకృష్ణ తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసి తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
కళకు, కళాకారులకు విలువను పెంచిన కథానాయకుడు, తెలుగోడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహా నాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతను తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ, అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకు స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘీక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశంగా చేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. అంటూ బాలకృష్ణ పోస్టు పెట్టారు.
ప్రస్తుతం బాలకృష్ణ టీడీపీలోనే ఉన్నప్పటికీ అంతగా యాక్టివ్ గా లేరు. ఎక్కువగా పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఆయన కేవలం సినిమాలకే పరిమితం అయ్యారు. ప్రస్తుతం బాలయ్య సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. 2014 లో ఎమ్మెల్యేగా గెలిచాక.. 2019 వరకు పాలిటిక్స్ లో యాక్టివ్ గానే ఉన్నారు బాలయ్య. 2019 తర్వాత నుంచి పాలిటిక్స్ జోలికి ఎక్కువగా వెళ్లడం లేదు.