ప్రయోగాలు చేయడంలో నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు. ‘ఆదిత్య 369, భైరవద్వీపం’ లాంటి సినిమాలే అందుకు నిదర్శనం. ఎవరైనా మంచి కథ తీసుకొస్తే తప్పకుండా ప్రయోగం చేస్తానని అంటుంటారు ఆయన. కానీ ఈమధ్య కాలంలో ఆయనకు అలాంటి కథ దొరకలేదు. అయితే త్వరలో దొరికేలా కనిపిస్తోంది. అందుకు కారణం దర్శకుడు గోపిచంద్ మలినేని. గోపిచంద్ మలినేని ఇటీవలే ‘క్రాక్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈయన తర్వాతి చిత్రం బాలకృష్ణతోనే ఉండనుంది. చాలా తక్కువ సమయంలో బాలకృష్ణ నుండి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్న డైరెక్టర్ ఈయన.
బాలయ్య అంత త్వరగా ఓకే చెప్పడానికి కారణం గోపిచంద్ చెప్పిన స్టోరీ లైన్. వాస్తవ సంఘటనల ఆధారంగా కథను రెడీ చేస్తున్నారట ఆయన. ఇందుకోసం గోపిచంద్ వందేళ్ల చరిత్ర కలిగిన వేటపాలెం గ్రంధాలయంలో రీసెర్చ్ చేస్తున్నారు. చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను పరిశోధిస్తున్నారు. డైరెక్టర్ చేస్తున్న రీసెర్చ్ చూస్తుంటే కథ బలంగా ఉండబోతుందని, చరిత్రలో దాగిన ఎవరైనా ఒక వ్యక్తి జీవితం ఆధారంగా కథ ఉండవచ్చని అనిపిస్తోంది. మరి గోపిచంద్ తవ్వుతున్న చరిత్ర ఏంటి, దాని నుండి ఆయన తయారుచేస్తున్న కథ ఎలా ఉండబోతుంది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.