నందమూరి నటసింహం బాలయ్య బాబు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ ఎన్నికలపై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల ముందుగానే మా ఎన్నికల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఐదారుగురు అభ్యర్థులు మా అధ్యక్ష పదవికి పోటీలో నిలబడ్డారు. వీరిలో ప్రకాష్ రాజ్- మంచు విష్ణు ల మధ్యనే అసలు పోటీ ఉందని ఇండస్ట్రీ భావించింది. అయితే ప్రకాష్ రాజ్ కర్నాటకకు చెందినవాడు కావటంతో లోకల్-నాన్ లోకల్ అంశం హైలైట్ అయ్యింది. ఇప్పటివరకు మా ఎన్నికల వ్యవహారంపై ఇండస్ట్రీ పెద్దలెవరూ నోరు మెదపలేదు. తాజాగా బాలకృష్ణ మాట్లాడుతూ… లోకల్, నాన్ లోకల్ అనే విషయాలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు.
సినీ రంగం గ్లామర్ ఇండస్ట్రీ అని వ్యాఖ్యానించిన బాలకృష్ణ… సమస్యలు బహిరంగంగా చర్చించడం సరికాదని అన్నారు. ఇంతకాలం ‘మా’ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంతో రాసుకొని, పూసుకొని తిరుగుతున్న సినీ పెద్దలు ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా అని ప్రశ్నించారు. గతంలో ‘మా’ అసోసియేషన్ లో ఉన్నవాళ్లు ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు అంటూ ఫస్ట్ క్లాస్ టికెట్లతో విమానాల్లో తిరిగారని… ఆ డబ్బులను ఏం చేశారని బాలయ్య ప్రశ్నించారు. ‘మా’ బిల్డింగ్ నిర్మాణం చేపడతామన్న మంచు విష్ణు వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. విష్ణు ముందుకొస్తే తాను కూడా ఇందుకు సహకరిస్తానని అన్నారు. అందరం కలిసి నిర్మిస్తే.. ఇంద్రభవనమే నిర్మించవచ్చని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.