ఎమ్మెల్యే హామీతో శాంతించిన బాలయ్య

ఎమ్మెల్యే హామీతో శాంతించిన బాలయ్య
గత కొన్నాళ్ళుగా రాష్ట్రంలోని పలు చోట్ల మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించిన సంగతి తెలిసిందే.  ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.  ముఖ్యంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలోని ముసునూరులోని ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పోలీసుల సాక్షిగా వైసీపీ నాయకులు పెకలించారు.  స్థానిక టీడీపీ నేతలు అడిగితే గుడికి అడ్డంగా ఉందని కారణం చెప్పారు.  ఈ సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.  జిల్లా టీడీపీ నేతలు ఈ విషయమై గరంగరంగా ఉన్నారు.  స్వయంగా నందమూరి బాలకృష్ణ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు.  
 
బాలయ్య కలుగజేసుకోవడంతో టీడీపీ నేతల్లో పట్టు మరింత ఎక్కువైంది.  విగ్రహాన్ని తిరిగి పెట్టే వరకు తగ్గేది లేదని కూర్చున్నారు.  బాలయ్య నిత్యంజిల్లా నేతలకు ఫోన్ చేసి ఈ వివాదంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ సూచనలు ఇస్తూ వచ్చారు.  దీంతో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి స్పందించాల్సి వచ్చింది.  నేరుగా ఆయన బాలకృష్ణకు ఫోన్ చేశారు.  తాను కూడా ఎన్టీఆర్ అభిమానినే అంటూ బాలయ్యతో చర్చ స్టార్ట్ చేసిన ప్రతాప్ రెడ్డి విగ్రహం వీపు భాగం గుడికి ఎదురుగా ఉండటం వలనే స్థానికుల కోరిక మేరకు తొలగించాల్సి వచ్చిందని వివరించారట. 
 
బాలయ్య కూడా సావదానంగా ఎమ్మెల్యే వెర్షన్ విన్నారట.  చివరికి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎలాంటి ఇబ్బందీ లేని చోట స్థలం చూసి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారట.  ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో బాలయ్య కూడా సంతృప్తి వ్యక్తం చేశారట.  మొత్తానికి పెద్ద రగడ కావాల్సిన వివాదాన్ని ఎమ్మెల్యే జోక్యం చేసుకుని మధ్యవర్తులు లేకుండా నేరుగా బాలయ్యతో మాట్లాడి హామీ ఇవ్వడం, బాలయ్య సైతం సానుకూలంగా స్పందించడంతో వివాదానికి ఫులుస్టాప్ పడింది.