సేవా కార్యక్రమాల్లో నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటారు. ప్రధానంగా వైద్య సహాయం చేయడంలో చేతికి ఎముక లేదన్నట్టు ఉంటారు. ఇప్పటికే ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్, బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ ద్వారా వందల మందికి వైద్య సహకారం అందిస్తున్న బాలయ్య కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో తాను ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న హిందూపూర్ ప్రజల కోసం మరింత సహాయం చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం 20 లక్షల రూపాయల సొంత నిధులతో కోవిడ్ మందులను నియోజకవర్గ ప్రజలకు అందించారు బాలయ్య. ఇప్పుడు తాజాగా మరొక సహాయం చేసి పెద్ద మనసు చాటుకున్నారు.
కోవిడ్ బాధితులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఆసుపత్రుల్లో బెడ్ల కొరత ఒకటి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఖాళీలు లేక కోవిడ్ రోగులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే బాలయ్య తన ఇంటిని కోవిడ్ రోగుల కోసం కేటాయించారు. హిందూపూర్ నందు ఉన్న తన గెస్ట్ హౌస్ ను ఆయన కోవిడ్ రోగులకు ఇచ్చారు. అంతేకాదు వారికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారట. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాలయ్య తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది.