Balakrishna: కొత్త జిల్లాలను స్వాగతిస్తూ హిందూపురం కోసం డిమాండ్ చేసిన బాలయ్య!

Balakrishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఉగాది పండుగలో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేసి ఏపీలో కొత్త జిల్లాలు అమలులోకి తెచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం, అదే విధంగా ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు వైయస్సార్ సిపి మెనీపెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే.

ఈ విషయంపై తాజాగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26 జిల్లాలు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాను అంటూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ఇదే విషయంపై తాజాగా ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు బాలకృష్ణ. హామీ ఇచ్చిన మేరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని జిల్లా ఏర్పాటు చేయాలి అన్నారు. అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో పయనిస్తోంది, వాణిజ్య, పారిశ్రామికంగా ముందంజ వేస్తోందని బాలకృష్ణ తెలిపారు.

ఈ నేపథ్యంలోనే హిందూపురము కేంద్రంగా చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బాలకృష్ణ. అదేవిధంగా జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు భవిష్యత్తు అవసరాలకు హిందూపురంలో భూమి పుష్కలంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఇక అనంతపురం జిల్లా పరిధిలోకి 8 నియోజకవర్గాలు, సత్యసాయి జిల్లా పరిధిలోకి ఆరు నియోజకవర్గాలు వస్తాయి.