రాయలసీమ అనంతపురం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీల నడుమ బీకర రాజకీయ పోరు నడుస్తోంది. పాత గొడవలను గుర్తుచేసుకుని మరీ యుద్దానికి దిగుతున్నారు. ప్రధానంగా జేసీ కుటుంబాన్ని ప్రభుత్వం టార్గెట్ చేయడంతో నిత్యం ఏదో ఒక రగడ నడుస్తూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నేరుగా ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి గొడవ చేయడంతో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ గొడవల నేపథ్యంలో తనకు పార్టీ నుండి స్థానిక నేతల నుండి ఎలాంటి సహకరమూ అందట్లేదని వాపోతున్నారు.
మరోవైపు పరిటాల కుటుంబం కూడ పార్టీతో అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. అదేమంటే పార్టీలోని అంతర్గత కలహాలే ఇందుకు కారణంగా అంటున్నారు. మరి ఆ కలహాలకు మూలం ఎవరూ అంటే కాల్వ శ్రీనివాసులు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. శ్రీనివాసులుకు చంద్రబాబు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ పదవిని అప్పగించారు. అక్కడే ముసలం మొదలయింది. జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాలు రెండూ పెద్దవి. వీరి నుండే బలమైన లీడర్లు పార్టీలో ఉన్నారు. పరిటాల ఫ్యామిలీ అయితే జిల్లా టీడీపీని దశాబ్దాలుగా భుజాల మీద మోస్తూ వచించింది.
అలాంటి తమను కాదని కాల్వకు పదవి ఇవ్వడం వారికి నచ్చలేదు. అప్పటి నుండి కాల్వకు పెద్దగా సహకరించట్లేదు వారు. అయినా వారిని కలుపుకుని పోవాల్సిన బాధ్యత కాల్వ శ్రీనివాసులుదే. అయితే ఆయన వారికంటే పంతంతో ఉన్నారట. కలవని వారిని బ్రతిమాలాల్సిన పనేలేదున్నట్టు ఉంటున్నారట. ఈమధ్య నందమూరి బాలకృష్ణ అనంతపురం పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటనలో నాయకుల మధ్యన ఉన్న ఈ విబేధాలు బయటపడ్డాయట. తాను వచ్చినా నాయకులు ఇలా ఎడమోహ పెడమోహంగా ఉండటం ఏమిటని మండిపడ్డారట. ఇకనైనా కలిసి ఉండమని చెప్పినట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.