సమాజ్ వాదీ పార్టీ అధినేత ఆయన.! ప్చ్.. వెన్నుపోటు తప్పలేదు. ఓ దశలో పార్టీ నుంచి ఆయన్ని బయటకు పంపేశారు కూడా. పుత్రరత్నమే ఆ ‘మర్యాద’ ఇచ్చారు తన తండ్రికి. ఆ పుత్రరత్నం అఖిలేష్ యాదవ్.! ఆ తండ్రి ములాయం సింగ్ యాదవ్.!
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్‌కి ఒకప్పుడు వున్న పేరు ప్రఖ్యాతుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన్ని ‘నేతాజీ’ అంటారు సమాజ్ వాదీ పార్టీ శ్రేణులు. ప్రధాని అయ్యే అవకాశం వున్న అతి కొద్దిమంది జాతీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరిగా వుండేవారు. గతంలో ఆయన కేంద్ర రక్షన శాఖ మంత్రిగా కూడా పని చేశారు.
పార్టీ తల్లకిందులయ్యింది..సమాజ్ వాదీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి.. అదీ కుటుంబ సభ్యుల మధ్య కుమ్ములాటలతోనే ఆ పార్టీ నిర్వీర్యమైపోయింది. మూడు సార్లు ములాయం సింగ్ యాదవ్ యూపీ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ ఓ సారి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
బీజేపీ రాజకీయాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది. ఆ సంక్షోభం ఎలాగోలా సద్దుమణిగినా, పూర్వపు వైభవం అయితే ఆ పార్టీకి వచ్చే అవకాశమే కనిపించడంలేదు.
కేవలం వెన్నుపోటు వల్లనే రాజకీయంగా కుంగి కుశించిపోయారు ములాయం సింగ్ యాదవ్. చివరికి ఆయన ఆ మానసిక క్షోభతోనే అనారోగ్యానికి గురై, తనువు చాలించారు. యూపీ సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభమంటూ ఏర్పడకపోయి వుంటే, యూపీలో ఆ పార్టీనే అధికారంలో వుండేది.. దేశ రాజకీయాల్లోనూ ఆ పార్టీ చక్రం తిప్పగలిగే స్థితిలో వుండేది.