మహిళా దినోత్సవం నాడు టీడీపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తకు అవమానం జరిగిందనీ, సాక్షాత్తూ మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ పొలిటీషియన్, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు సంయమనం కోల్పోయి సదరు మహిళా కార్యకర్తపై చెయ్యి చేసుకున్నారనీ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. టీడీపీ అనుకూల మీడియా కూడా ఈ విషయాన్ని ధృవీకరించాక, ఇందులో వాస్తవం లేదని ఎలా అనుకోగలం.? అయితే, ఈ ఘటనతో జరిగిన డ్యామేజీని కంట్రోల్ చేసుకోవడానికి అశోక్ గజపతిరాజు తనదైన స్టయిల్లో వివరణ ఇచ్చారు. తనకు మర్యాదలు తెలుసనీ, సభ్యత, సంస్కారం తనకు బాగా తెలుసనీ చెప్పుకున్న అశోక్ గజపతిరాజు కొందరు దురుద్దేశపూర్వకంగా కట్టు కథలు అల్లారని ఆరోపించారు. ‘అక్కడ అలాంటి ఘటన ఏదీ జరగలేదు. పార్టీకి సంబంధించిన కార్యక్రమం జరుగుతోందక్కడ.
పార్టీ కార్యకర్తల హంగామా నడిచింది.. అందరూ అక్కడ హ్యపీగానే వున్నారు.. కొట్టడం అనేది జరిగితే, ఆ మహిళ ఎవరో మీడియా ముందుకు వచ్చేదే కదా..’ అని అశోక్ గజపతిరాజు నేషనల్ మీడియాకి చెందిన ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో స్పందించారు. అయితే, వైసీపీ నేత రవిచంద్రారెడ్డి మాత్రం, అశోక్ గజపతిరాజు సహా టీడీపీ నేతలకు అసహనం పెరిగిపోయిందనీ, చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ కూడా ఓ టీడీపీ కార్యకర్తపై దాడి చేశారనీ, చంద్రబాబు కూడా అసహనంతో ఊగిపోతున్నారనీ చెప్పుకొచ్చారు. ‘వయసు అయిపోతోంది కాబట్టి, అసహనం పెంచుకోకుండా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంటే మంచిది..’ అని రవిచంద్రారెడ్డి, అశోక్ గజపతిరాజుకి ఉచిత సలహా ఇచ్చారు. అయితే, సంఘటన జరిగిందంటున్న సమయంలో అక్కడ లేనివారు కట్టుకథలు అల్లుతున్నారని అశోక్ గజపతిరాజు ఆరోపించారు.