ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు టార్చర్.. బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ?

ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై ఆర్టీసీ ఉద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అధికారులు ఉద్యోగులకు కొరియర్‌ పార్శిల్‌ టార్గెట్‌ పెడుతుండటంతో కొందరు ఉద్యోగులు తమ సొంత డబ్బును ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. డోర్ డెలివరీ పార్శిల్ సర్వీస్ ను కొన్నిరోజుల క్రితం ఆర్టీసీ ప్రారంభించగా ప్రతి ఉద్యోగి మూడు డోర్ డెలివరీ పార్శిల్స్ బుకింగ్ చేయాలని అధికారులు టార్గెట్ పెడుతున్నారని బోగట్టా.

గుంటూరు జిల్లాలోని పలు డిపోలలో బుకింగ్స్ కోసం ఒక్కో ఉద్యోగి నుంచి 210 రూపాయల చొప్పున బలవంతంగా వసూలు చేస్తున్నారని సమాచారం అందుతోంది. కొన్ని ప్రాంతాలలో డబ్బులు చెల్లించినట్టు రశీదు ఉంటే మాత్రమే డ్యూటీలకు అనుమతిస్తున్నారని తెలుస్తోంది. డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కిందిస్థాయి సిబ్బందికి సైతం ఈ తరహా టార్గెట్లు విధిస్తుండటంతో ఉద్యోగులు లోలోపల ఎంతగానో బాధపడుతున్నారు.

డబ్బులు కట్టడం ఇష్టం లేకపోయినా అధికారులతో పెట్టుకుంటే ఇబ్బందులు తప్పవని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు జీతాలు పెరగడం లేదని ఉద్యోగులు బాధ పడుతుంటే అధికారులు ఈ విధంగా చేయడం వాళ్లను మరింత బాధ పెడుతోంది. ప్రతి నెలా ఈ విధంగా అధికారులు డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఉద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై, అధికారులపై విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంది.

కొత్తగా ఆర్టీసీ తెచ్చిన డోర్ డెలివరీ సర్వీస్ కు ఆదరణ బాగా ఉందని ప్రచారం చేసుకోవడం కోసం అధికారులు ఉద్యోగుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అధికారులు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ వేధిస్తున్నారని కొంతమంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోర్‌ డెలివరీపై అవగాహన కల్పించకుండా ఉద్యోగులను ఇబ్బందులు పెట్టడం సరికాదని మరి కొందరు చెబుతున్నారు.