అప్పూ.. చాలా పెద్ద తప్పు చేసేశావ్.!

అప్పూ అలియాస్ పవర్ స్టార్ అలియాస్ పునీత్ రాజ్ కుమార్.. చాలా చిన్న వయసులోనే దివికేగాడు. లక్షలాది మంది అభిమానుల్ని శోకసంద్రంలోకి నెట్టేశాడు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కంటతడి పెట్టించేశాడు. వాళ్ళకు తీరని శోకాన్ని మిగిల్చాడు.

కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల దేశమంతా శోకిస్తోందనడం అతిశయోక్తి కాదేమో. అందుక్కారణం, అతను మంచి నటుడు అని మాత్రమే కాదు.. అంతకు మించి మానవతావాది కావడమే. బోల్డన్ని సేవా కార్యక్రమాలతో పునీత్ రాజ్ కుమార్ తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు.

పునీత్ రాజ్ కుమార్‌ని చాలామంది ‘అప్పూ’ అని పిలుస్తారు. ఆ మమకారంతోనే, ‘అప్పూ.. ముందుగానే వెళ్ళిపోయి చాలా తప్పు చేశావ్..’ అంటూ కన్నీరు మన్నీరవుతున్నారు. మన టాలీవుడ్ నటులు జూనియర్ ఎన్టీయార్, బాలకృష్ణ బెంగళూరు వెళ్ళి, పునీత్ రాజ్ కుమార్ పార్తీవ దేహాన్ని చూసి చలించిపోయారు.. కంటతడి పెట్టారు.

వేల మంది విద్యార్థులు పునీత్ రాజ్ కుమార్ అందిస్తోన్న ఆర్థిక సాయంతో తమ విద్యను కొనసాగిస్తున్నారు. వారందరి పరిస్థితి ఏంటి.? పునీత్ రాజ్‌కుమార్‌ని తమ ఇంటి సభ్యుడిగా భావించే లక్షలాదిమంది అభిమానుల పరిస్థితి ఏంటి.?