రైతులకు కౌలు కట్టరు కానీ భూములను మాత్రం అమ్మేస్తారట 

AP government
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు అమ్మి సొమ్ము చేసుకునే ఆలోచనలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు రాజధాని భూములను అమ్మడానికి రెడీ అయింది.  ఒకేసారి 1600 ఎకరాల భూమిని ఈ వేలం ద్వారా అమ్మాలని ప్రభుత్వం భావిస్తోందట.  అభివృద్ది పథకాల అమలు కోసం నిధులను సమకూర్చుకోవడానికి ఈ భూములను అమ్మాలనుకుంటున్నారట.  అమ్మకం ద్వారా వచ్చిన నిధులను మిషన్ బిల్డ్ ఏపీకి బదిలీ చేస్తారట.  ఈ విషయాన్ని మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర హైకోర్టుకు నివేదిక ద్వారా తెలిపారు.  
 
ఇది వరకటి టీడీపీ ప్రభుత్వం ఆమరావతి ప్రాంతంలో స్టార్టప్ కంపెనీల ఏర్పాటు కోసం ఈ భూమిని సింగపూర్ కన్సార్టియంకు అప్పగించింది.  వాణిజ్య, వ్యాపార సముదాయాలతో ఈ భూమిని అభివృద్ది చేయాలని కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకుంది.  దీని ద్వారా లక్ష కోట్ల ఆదాయాన్ని ఆర్జించే సంపద సృష్టించబడుతుందని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది.  కానీ ఎన్నికల్లో టీడీపీ ఓడటం, వైసీపీ గెలవడంతో ప్రభుత్వం మారిపోయింది.  ఉన్నట్టుండి జగన్ మూడు రాజధానుల పాట అందుకున్నారు.  దాంతో ఆమరావతి నిర్మాణానికి గ్రహణం పట్టింది. 
 
ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి.  ఆమరావతి రాజధానిగా ఉందని ఖాయమైపోయింది.  ఇప్పటికే కట్టిన భవనాలను అమ్మి ఆదాయం పొందాలని ప్రభుత్వం చూస్తోంది.  దీంతో సింగపూర్ కన్సార్టియం ప్రాజెక్టు నుండి వైదొలగాలని నిర్ణయించుకుంది.  ప్రభుత్వంతో ఒప్పందాలు రద్దు చేసుకుంది.  దీంతో ప్రభుత్వం వద్ద రైతుల నుండి సేకరించిన 1600 ఎకరాల భూమి మిగిలింది.  దీనికి నిబంధనల ప్రకారం రైతులకు కౌలు చెల్లించాల్సి ఉంది.  కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు.  ఆమరావతిని అడ్డుకోవద్దని దీక్షలు చేస్తున్న రైతులకు సమాధానం ఇవ్వలేదు, పరిష్కారం చూపలేదు.  కానీ ఉన్నపళంగా భూములు అమ్మడానికి మాత్రం రెడీ అయిపోయింది.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యమం చేస్తున్న రైతుల్లో ఆగ్రహం రెట్టింపవుతోంది.